ఇంద్రుడి అమరావతిని ఇలకు తెచ్చేస్తున్నారుగా !
అమరావతి రాజధాని అందంగా తయారయ్యేందుకు రంగం సిద్ధం అయింది. ఏకంగా 11 వేల 467 కోట్ల రూపాయల నిధులతో అమరావతి పునర్నిర్మాణ పనులు ఘనంగా మొదలవుతున్నాయి.
By: Tupaki Desk | 3 Dec 2024 8:30 PM GMTఅమరావతి అంటే ఇంద్రుని నగరం. అక్కడ వైభోగాలకు కొదవ లేదు. సకలమూ సౌందర్యమే. స్వర్గానికి పర్యాయపదం కూడా. అటువంటి అద్భుతాన్ని ఇలకు తీసుకుని రావాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కల కన్నారు. పూర్తి ప్రణాళికలతో బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టారు.
అమరావతి రాజధాని అందంగా తయారయ్యేందుకు రంగం సిద్ధం అయింది. ఏకంగా 11 వేల 467 కోట్ల రూపాయల నిధులతో అమరావతి పునర్నిర్మాణ పనులు ఘనంగా మొదలవుతున్నాయి. ఈ మేరకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది.
ప్రధాన రహదారులతో పాటు పలు నూతన భవనాల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. అదే విధంగా చంద్రబాబుని నమ్మి వేల ఎకరాల భూములను ఉదారంగా రాజధానికి ఇచ్చి ఏళ్ల తరబడి వేచి చూసిన రైతులకు మేలు చేసేందుకు కూడా నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం వారికి ఇచ్చిన లే అవుట్లలో అభివృద్ధి పనులను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ మొత్తం పనులకు సీఆర్డీఏ ఆమోదముద్ర వేసింది.
ఈ విధంగా అమరావతి రాజధాని తొలి దశ పనులను ప్రారంభించేందుకు మొత్తం సిధం చేశారు. మొత్తం 11.467 కోట్ల రూపాయల నిధులలో 2,498 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారుల పనులు చేపట్టనున్నారు. 1,585 కోట్ల రూపాయల నిధులతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువలతో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణంతో సహా అభివృద్ధి చేస్తారు.
అలాగే,3,525 కోట్ల రూపాయాలతో అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగవ తరరగతి ఉద్యోగుల నివాసాల భవనాలను నిర్మిస్తారు. 3,859 కోట్ల రూపాయలతో భూములు ఇచ్చిన రైతుల స్థలాలలో లే అవుట్లను అభివృద్ధి చేస్తారు. దీని కోసం పాత టెండర్లను రద్దు చేసి ప్రస్తుత ధరలకు అనుగుణంగా కొత్త టెండర్లను పిలుస్తారు అని అంటున్నారు.
ఇవే కాకుండా అమరావతి రాజధానిలో హ్యాపియెస్ట్ ప్రాజెక్ట్ కి 984.10 కోట్ల రూపాయలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు అని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో ఈ విధంగా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు.
ఈ పనులన్నీ శరవేగంగా రూపు దిద్దుకోవడానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఇచ్చిన 8,496 ఎకరాల భూములలో లే అవుట్లు వేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణాలతో రూపొందిస్తున్నారు. అంతర్గత రోడ్లతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, మంచినీరు, విద్యుత్, ఐటీసీ కేబుళ్ళు వంటి వాటికి ప్రత్యేక డక్టులు ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ప్రతీ రోడ్డు వెంబడి వాకింగ్ స్ట్రైకింగ్ ట్రాకులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రధాన రహదారుల నిర్మాణం కోసం కూడా అంతర్జాతీయ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇక అమరావతి రాజధాని నుంచి మూడు జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నారు. అమరావతి తూర్పు నుంచి పడమరకు మొత్తం పదహారు ప్రధాన రహదారులను నిర్మిస్తున్నారు.
ఇందులో మెజారిటీ రోడ్లను చెన్నై, కోల్ కటా జాతీయ రహదారితో అనుసంధానం చేస్తున్నారు. కరకట్ట రహదారిని నాలుగు లైన్లుగా పెంచి అభివృద్ధి చేయనున్నారు. మొత్తం మీద చూస్తే అమరావతి ఇంద్రుడి నగరానికి ఏ మాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసింది.
అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో మాస్టర్ ప్లాన్ తో ప్రగతి పనులకు రంగం సిద్ధం చేయడం మాత్రం ఇదే తొలిసారి అని అంటున్నారు. దీంతో అమరావతి సరికొత్త రూపును సంతరించుకోనుంది అని అంటున్నారు. అతి తక్కువ టైం లోనే అమరావతి అద్భుతమైన రాజధానిగా జనం ముందుకు రానుందని అంటున్నారు. సో ఏపీ రాజధాని అమరావతిని చూడడానికి రెండు కళ్ళూ చాలవన్న మాట.