బాబు సాధించారు: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ పై వరాలు!
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిపించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 10:46 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ప్రధాన మద్దతు దారుగా ఉన్న టీడీపీ.. కేంద్రప్రభుత్వం నిలబడేందుకు ఆక్సిజన్ అందిస్తు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రయోజనాలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో చూసీ చూడనట్టే వదిలేసిన ఏపీ ప్రయోజనాలకు ఇప్పుడు కీలక రోల్ పోషిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిపించారు. మొత్తం బడ్జెట్‌లో మధ్యతరగతి, వేతన జీవులకు కూడా ఊరట లభించేలా నిర్ణయాలు ఉన్నాయి.
తాజా కేటాయింపుల్లో ఏపీకి కీలకమైన, ముఖ్యంగా సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం, అమరావతికి మరోసారి ప్రాధాన్యం దక్కింది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తున్న, చేయిస్తున్న విషయం తలిసిందే. గత బడ్జెట్‌లో అమరావతి రాజధానికి రూ.15000 కోట్లను ఇప్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ద్వారా.. ఈ మొత్తం సమకూరుస్తోంది. ఇక, తాజా బడ్జెట్‌లో నేరుగా అమరావతి రాజధాని కోసం.. ప్రత్యేక కేటాయింపులు జరపకపోయినా.. మద్దతు ఇస్తామని పేర్కొంది.
ఇక, కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు, విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా 5396 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు గ్రాంటు రూపంలో బకాయి ఉన్న 12157 కోట్లరూపాయలను కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో చూపించడం గమనార్హం. దీంతో మొత్తంగా పోల వరం ప్రాజెక్టుకు సుమారు 18 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం అందనుంది.
ఇక, మరో కీలక ప్రాజెక్టు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దీనిని నిలబెట్టాలంటూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే 11440 కోట్ల రూపాయలను ఇచ్చిన కేంద్రం తాజా బడ్జెట్‌లో 3295 కోట్ల రూపాయలను ప్రకటించింది. అలాగే, విశాఖపట్నంలోని పోర్టు అభివృద్ధికి 730 కోట్ల రూపాయలను ప్రకటించింది. ఆయా కేటాయింపులతో ఈ ప్రాజెక్టుల వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.