Begin typing your search above and press return to search.

షర్మిల పీసీసీ పదవి అవుట్ ?

వైఎస్సార్ కుమార్తె అన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు పార్టీ అత్యున్నత పదవిని కట్టబెట్టింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 3:30 PM GMT
షర్మిల పీసీసీ పదవి అవుట్ ?
X

వైఎస్సార్ కుమార్తె అన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు పార్టీ అత్యున్నత పదవిని కట్టబెట్టింది. ఆమె వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని పార్టీకి నాలుగు ఓట్లు వస్తాయని కూడా ఆలోచించింది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల మేలు కంటే కీడే పార్టీకి ఎక్కువ చేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.

ఆమె ఎంతసేపూ తన సొంత అజెండాను తెచ్చి పార్టీ మీద పెడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు అన్న జగన్ తో ఉన్నవి పూర్తిగా వ్యక్తిగత వైరాలే. ఆమెకు వారితో ఆస్తుల వివాదాలు ఉన్నా లేక మరోటి ఉన్నా అవన్నీ పూర్తిగా ఆమె సొంత విషయాలు కిందకే లెక్క.

వాటికి న్యాయస్థానాలు సరైన పరిష్కారం. అక్కడ ఆమె వాటి విషయం తేల్చుకుంటూ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. అపుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. ఆమెకు కూడా తగిన గౌరవం ఉంటుంది.

కానీ షర్మిల చేస్తున్నది ఏమిటి. ఆమె ఆస్తి వివాదాలతోనే నిండా మునుగుతున్నారు. వాటి మీదనే ఆమె స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దాని కోసమే ఆమె పీసీసీ చీఫ్ ట్యాగ్ ని వాడుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. లేకపోతే పొలిటికల్ గా ఆమెకు ఇంత విస్తృత ప్రచారాన్ని మీడియా కూడా ఇవ్వదని అంటున్నారు.

ఆస్తుల విషయంలో గత రెండు మూడు రోజుల్గా ఏపీ రాజకీయాల్లో జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. జగన్ నేషనల్ లా ట్రిబ్యునల్ కి వెళ్ళడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ విషయంలో షర్మిల బాధితురాలు అని మొదట్లో అనిపించినా చివరికి చూస్తే ఈ కేసులో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అవి బలంగా ఉన్నాయి. అందుకే ఈ విషయంలో షర్మిలకు మద్దతు అయితే పెద్దగా రాలేదు అని అంటున్నారు. అంతే కాదు ఆమె వాదనలు కూడా లాజిక్ కి దగ్గరగా లేవని అంటున్నారు

ఇక ఇదే ఎపిసోడ్ లో చూసుకుంటే కనుక ఆమె జగన్ కి రాసిన లేఖలు అన్నీ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బయటకు రావడం కూడా రాజకీయంగా కలకలం రేపేదిగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కానీ ఏపెలో కానీ టీడీపీ బీజేపీతో ఉంది. అంటే ఎన్డీయేలో కీలకమైన పార్టనర్ గా ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఎలా చూసుకున్నా బీజేపీతో ఉన్న టీడీపీ కాంగ్రెస్ కి కడు దూరమే.

కానీ ఏపీలో ఏమి జరిగినా జగన్ మీద ద్వజమెత్తడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ షర్మిలకు ఆ విధంగా మద్దతు ఇస్తోంది. మరి అది పరాకాష్టకు చేరినట్లుగా షర్మిల లేఖలు టీడీపీ ట్విట్టర్ లో కనిపించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడక తప్పదని అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కాకపోగా కొత్త తలనొప్పులు తెస్తున్నట్లుగా ఉన్న షర్మిల వైఖరితో విసిగిన ఏఐసీసీ పెద్దలు ఆమెను తొందరలోనే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారు అని అంటున్నారు.

టీడీపీతో కుమ్మక్కు అయి తన వ్యక్తిగత లెటర్స్ వారికి ఇచ్చి పూర్తిగా టీడీపీతో ఆమె ఉంటున్నారు అని డిసైడ్ అయి ఈ విధంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. దీంతో షర్మిలను తొందరలోనే తప్పిస్తారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఇక షర్మిల తీరు చూసినా కాంగ్రెస్ ఏపీలో ఏ మాత్రం బాగుపడేది లేదని కూడా ఆ పార్టీ నేతలు ఒక అంచనాకు వచ్చారని అంటున్నారు. వైసీపీ ఓడాక సహజంగానే అందులో ఉన్న పాత నాయకులు కాంగ్రెస్ వైపు రావాలి. కానీ ఆ దిశగా గడచిన నాలుగైదు నెలలుగా ఒక్క నేతను కూడా ఈ వైపునకు రప్పించలేకపోయారు అని అంటున్నారు

పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలు లేవు అని బలోపేతం చేసే చర్యలు లేవన్ అంటున్నారు. అధికార టీడీపీ మీద విమర్శలు చేయాల్సింది పోయి ఎంతసేపూ జగన్ అంటూ సొంత అజెండాతోనే షర్మిల ముందుకు సాగడం పట్ల కూడా ఆ పార్టీ పెద్దలు గట్టిగానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక చూస్తే ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఒంటరి అయింది అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది.జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదంలోకి అతి ఉత్సాహంగా టీడీపీ ఎంట్రీ ఇచ్చినా సొంత పార్టీ నేతలు మాత్రం మౌనం దాల్చారు. ఆఖరికి ఆమె ఏరి కోరి నియమించిన అధికార ప్రతినిధులు కూడా ఆ వైపు చూడలేదు. వారంతా కూడా షర్మిల ధోరణుల పట్ల అసంతృప్తిగా ఉన్నారనే అంటున్నారు.

పైగా ఇండియా కూటమి వైపుగా జగన్ చూస్తున్న నేపధ్యం ఉంది. రానున్న రోజులలో రాజకీయాలు తమకు అనుకూలంగా మారుతాయని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్న క్రమంలో షర్మిల మొత్తం రాజకీయ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు సోదరుడికి మధ్య ఉంటే అది వేరేగా చూసుకోవాలని దానికి కాంగ్రెస్ ని వాడుకోవడం మంచిది కాదని అంటున్నారు

అందుకే షర్మిల వర్సెస్ జగన్ మీద టీవీలో జరిగిన డిబేట్లకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు వచ్చారు కానీ ఏపీ నేతలు కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ లో ఏపీ స్థాయిలో ఢిల్లీ స్థాయిలోనూ కూడా షర్మిలకు మద్దతు అయితే దక్కడం లేదు అని అందుకే ఆమె పీసీసీ పదవి అవుట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.