Begin typing your search above and press return to search.

వైసీపీలో కాంగ్రెస్ ని కలిపేస్తున్న జగన్ !

జగన్ ఇంట్లో ఒంట్లో కాంగ్రెస్ పార్టీయే ఉంది. జగన్ కి ఆరేళ్ళ వయసు నుంచే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   11 Feb 2025 3:37 AM
వైసీపీలో కాంగ్రెస్ ని కలిపేస్తున్న జగన్ !
X

జగన్ ఇంట్లో ఒంట్లో కాంగ్రెస్ పార్టీయే ఉంది. జగన్ కి ఆరేళ్ళ వయసు నుంచే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే 1978లో వైఎస్సార్ తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలా వైఎస్సార్ కాంగ్రెస్ లో కీలక స్థానాలను చూసి సీఎం గా కూడా అయ్యారు. ఇక జగన్ పెద్దవారు అయ్యాక తండ్రికి ఎన్నికల్లో సాయం చేస్తూ వచ్చారు. అలా ఎన్నికల ప్రచారం తమ సొంత జిల్లాలో చేస్తూ కాంగ్రెస్ నే భుజాన వేసుకున్నారు.

జగన్ తొలిసారి 2009లో కాంగ్రెస్ నుంచే ఎంపీగా తొలిసారి గెలిచారు. ఇక కాంగ్రెస్ తో విభేదాలతో ఆయన వేరుపడి వైసీపీని పెట్టుకున్నా అందులోనూ కాంగ్రెస్ ఉంది. ఇక వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే.

ఈ నేపథ్యంలో ఏపీలో ఇంకా అరకొరగా మిగిలి ఉన్న కాంగ్రెస్ ని దాని ఓటు బ్యాంక్ ని పూర్తిగా కొల్లగొట్టే పనిలో జగన్ ఉన్నారని అంటున్నారు. ఒకనాడు సీనియర్ కాంగ్రెస్ నేతలను వైసీపీలోనికి తీసుకోని జగన్ ఇపుడు రూటు మార్చారు. కాంగ్రెస్ లో ఉన్న వారికి జగన్ తరఫున పిలుపులు వెళ్తున్నాయి. తన తండ్రి వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని నాడు నడిపించిన వారిని అందరినీ ఇపుడు తన వెంట ఉండమని జగన్ కోరుతున్నారు.

జగన్ పిలుపులు ఎక్కడిదాకా వెళ్ళాయి అంటే రాజకీయాలను వదిలేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని సైతం పార్టీలోకి రమ్మని కోరేటంతగా అంతే కాదు రఘువీరారెడ్డి, పల్లం రాజు జీవీ హర్ష కుమార్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఆఖరుకు పులివెందులకే చెందిన సీనియర్ నేత తనను నిత్యం విమర్శించే తులసీరెడ్డిని కూడా వైసీపీలో చేరమని జగన్ కోరుతున్నారు అంటే జగన్ పూర్తిగా మారిపోయారు అని అంటున్నారు.

జగన్ ఈ పిలుపుల వెనక ఉన్న వ్యూహం చాలా పదునైనదే. ఏపీలో కాంగ్రెస్ తిరిగి లేవకుండా చేసుకోవడం. దాని ద్వారా తన ఓటు బ్యాంక్ పూర్తి స్థాయిలో కాపాడుకోవడం. అదే సమయంలో దేశంలో కాంగ్రెస్ ఓటమి వరసగా ఉంది. ఆ పార్టీ ఇపుడు క్షీణ దశలో ఉంది. దాంతో ఇదే అదనుగా జగన్ ఏపీలోని కాంగ్రెస్ ని పూర్తిగా కలుపుకుంటున్నారు అని అంటున్నారు.

జగన్ నుంచి అనేక మంది సీనియర్ నేతలకు పిలుపులు వెళ్ళాయి. వారు కనుక పార్టీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని వారిని గౌరవంవా చూసుకుంటామని చెబుతున్నారుట. అలాగే వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడే గొంతులు కూడా వస్తాయని అలాగే ప్రజలలో పోరాటం చేసేవారు కూడా వస్తారని భావించే ఈ రకమైన వ్యూహానికి జగన్ తెర తీశారు అని అంటున్నారు. అదే విధంగా తన సోదరి షర్మిలను కూడా పూర్తిగా దెబ్బ తీయడానికి కూడా ఆపరేషన్ కాంగ్రెస్ ని ఎంచుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఖాళీ చేసి వైసీపీని బలోపేతం చేయాలని జగన్ 2.0 అవతార్ ని సిద్ధం చేశారని అంటున్నారు.