టార్గెట్ పవన్...ఎందుకిలా ?
ఇటీవల కొద్ది రోజులుగా చూస్తే కనుక ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారు
By: Tupaki Desk | 28 Dec 2024 1:30 AM GMTఇటీవల కొద్ది రోజులుగా చూస్తే కనుక ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారు. వైసీపీ ఎటూ ఆయన మీద విమర్శలు చేస్తుంది. కార్నర్ చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం పవన్ మీదనే పోస్టులు పెడుతున్నారు.
ఇక ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే తెలంగాణా ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య గ్యాప్ వచ్చిందని చర్చ అయితే సాగింది. సంధ్యా థియేటర్ వద్ద ఒక మహిళ చనిపోయిన ఎపిసోడ్ తరువాత పరిణామాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.
ఆయన నిండు సభలో బెనిఫిట్ షోలు లేవు అని చెప్పేశారు. అంతే కాదు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వమని కూడా ఖరాఖండీగా తేల్చేశారు. ఆయన తరువాత వరసగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ఇదే అంశం మీద తలో రకంగా వ్యాఖ్యలు చేశారు. అందులో చాలా వరకూ టాలీవుడ్ ని ఇబ్బంది పెట్టేవిగానే ఉన్నాయి.
అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ పెద్దలు సమావేశం అయిన సందర్భంగా కూడా బెనిఫిట్ షోల మీద ఏ విధమైన ఉపశమనం లభించలేదు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో జగన్ సర్కార్ అధికారంలో ఉన్నపుడు మా టాలీవుడ్ మీద సినీ వ్యాపారం మీద మీ పెత్తనం ఏమిటి అని బిగ్ సౌండ్ చేసిన పవన్ కళ్యాణ్ ఇపుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారని సోషల్ మీడియా తో పాటుగా రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉంది.
ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కొందరు తెలంగాణా ఎమ్మెల్యేలు ముందుకెళ్ళి ఆంధ్రా తెలంగాణా అన్న విభజన కూడా తీసుకుని వచ్చారు. భారతీయత జాతీయ సమగ్రత వంటి వాటి మీద గట్టిగా నిలబడి మాట్లాడే పవన్ ఈ అంశంలో కూడా నోరు మెదపకపోవడం పట్ల కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.
అదే విధంగా జగన్ అయితే టాలీవుడ్ పెద్దల చేత వంగి వంగి నమస్కారాలు చేయించుకున్నారు అంటూ ఏకంగా చాలా కాలం పాటు విమర్శలు చేస్తూ వచ్చిన పవన్ రేవంత్ రెడ్డికి కూడా టాలీవుడ్ లో వయో వృద్ధులు అనుభవం పండిన వారు దండాలు పెట్టిన తీరుకు ఏమంటారు అని కూడా సామాజిక మాధ్యమాలలో ప్రశ్నలు సంధించిన వారు ఉన్నారు.
ఇపుడు ఏపీలో చూస్తే వైసీపీ పెరిగిన విద్యుత్ చార్జీల మీద నిరసనలు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీద విమర్శలు చేస్తూనే వైసీపీ నేతలు పవన్ మీద కూడా కామెంట్స్ చేశారు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఏకంగా పవన్ ని ఇమిటేట్ చేస్తూ నాడు ఊగిపోయి విద్యుతు చార్జీల బాదుడు అని తమ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పవన్ ఇపుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు
అదే విధంగా చూస్తే మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా పవన్ ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. పెరిగిన విద్యుతు చార్జీల మీద ఈ బాదుడు మీద చంద్రబాబుని ప్రశ్నించాల్సిన అవసరం పవన్ కి లేదా అని ఆమ అంటున్నారు. మొత్తం మీద ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.
దానికి కారణం ఆయన గతంలో చేసిన కామెంట్స్ అని అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా గట్టిగా మాట్లాడిన పవన్ ఇపుడు మౌన ముద్ర దాల్చడం ఏంటని పాత వీడియోలను సైతం బయటకు తీసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ ఇదే మౌనం కొనసాగిస్తారా లేక తనదైన ఆవేశంతో తగిన జవాబు చెప్పి ఈ విమర్శలకు చెక్ చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.