Begin typing your search above and press return to search.

ఐ డోంట్ కేర్ అంటూ ఓపెన్ అయిపోయిన పవన్ !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపుగా అయిదు నెలల పాటు మౌనంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2024 12:30 PM GMT
ఐ డోంట్ కేర్ అంటూ ఓపెన్ అయిపోయిన పవన్ !
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపుగా అయిదు నెలల పాటు మౌనంగా ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తనకు ఇచ్చిన శాఖలను చూసుకుంటూ రివ్యూ చేస్తూ గడిపారు. ఒక విధంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వంలో పవన్ పరిమితమైన పాత్ర అన్న చర్చ కూడా వచ్చింది.

దూకుడుగా ఉండే పవన్ ఇంత సైలెంట్ ఏంటి అని జనసేనలోనే చర్చ వచ్చింది. ఇదిలా ఉంటే ఏపీలో గత అయిదు నెలలుగా అనేక అంశాలు జరిగాయి. మహిళల మీద అఘాయిత్యాలు అందులో మొదటి ప్లేస్ లో ఉంటే ఇసుక దందాలు మద్యం విషయంలో కూడా అధికార హవా అన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో పవన్ ఏమి చేస్తున్నారు అని వైసీపీ సహా అందరూ అంటున్న నేపధ్యం ఉంది. నిజానికి ఇసుక మద్యం విషయంలో ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు చంద్రబాబు హెచ్చరిస్తున్నారు కానీ జరగాల్సినవి అలాగే జరుగుతున్నాయి. ఇక మహిళల మీద వరసబెట్టి కొనసాగుతున్న అఘాయిత్యాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి.

ఈ పరిణామాల క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయారు. ఎంతలా అంటే పదవి ఉన్నా లేకుండా ఐ డోంట్ కేర్ అన్నంతగా. ఆయన పిఠాపురం పర్యటనలో భాగంగా పోలీసుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా డీజీపీ ఐజీలను దాటి హోం మంత్రి అనితకే గురి పెట్టాయి.

నిజానికి ఇప్పటికే వైసీపీ నేతలు అనితను ఫెయిల్యూర్ హో మంత్రి అని అంటూంటే పవన్ కూడా ఇండైరెక్ట్ గానే ఆమెను అలా ఫిక్స్ చేశారా అన్న చర్చ సాగుతోంది. నేనే హోం మంత్రిని అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది అని పవన్ అనడం అంటే ప్రస్తుత హోం మంత్రి ఫెయిల్ అయినట్లే అని చెప్పినట్లేనా అన్న చర్చ సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే హోం మంత్రి సమీక్ష చేయాలని ఆయన కోరడమూ చర్చకు తావిస్తోంది. ఆమె సహచర మంత్రి. ఆమె శాఖలో సరిగ్గా పరిస్థితులు లేవు అని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చెప్పవచ్చునని అయితే ఆయన బాహాటంగా ఎందుకు చెప్పారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏ విషయం అయినా చర్చించే స్వేచ్చ అయితే పవన్ కి ఉంది. అదే సమయంలో మంత్రి వర్గ సమావేశాల్లోనూ ఈ విషయాలు ఎత్తవచ్చు. ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం కూడా ఉంది. సరిగ్గా దానికి రెండు రోజుల ముందు పవన్ తన కేబినెట్ కొలీగ్ మీద చేసిన కామెంట్స్ మాత్రం టీడీపీని ఇరకాటంలో నెట్టాయని అంటున్నారు.

పవన్ మనసులో ఏదైనా ఉండవచ్చు కానీ చెప్పాల్సిన వేదిక అయితే అది కాదు అని టీడీపీలో ఒక డిస్కషన్ జరుగుతోందని అంటున్నారు. ఇక పవన్ చేసిన కామెంట్స్ మీద టీడీపీ నేతలు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. మరో మంత్రి నారాయణ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కి ఆ విధంగా ప్రభుత్వం విషయంలో మాట్లాడే స్వేచ్చ ఉందని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను చూసి అలెర్ట్ కావాలని ఆయన అన్నారు. అదే సమయంలో తమ ముఖ్యమంత్రి అందరినీ కోర్ ఆర్డినేట్ చేయగలరని కూడా సమర్ధించుకున్నారు.

మంత్రుల నుంచి నారాయణ స్పందన ఇలా ఉంటే టీడీపీలో అయితే పవన్ ఈ విధంగా ఫైర్ కావడం వెనక ఆయన ఆలోచనలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది. పవన్ కేవలం మహిళల మీద అత్యాచారాలతోనే వదిలేయలేదు. రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో బాలికలను కూడా ఇబ్బంది పెడుతున్నారని మరో కీలకమైన ఆరోపణలు చేశారు. హాస్టల్స్ ని ఏ ఎమ్మెల్యే అయినా సందర్శించారా అని పవన్ ప్రశ్నించారు.

ఎంతసేపూ మద్యం ఇసుక మీద ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల మీద లేకపోతే ఎలా అని ఆయన చురకలు అంటించారు. తనకు అయితే మోజు అధికారం మీద ఉండదని ప్రజా సమస్యలే ముఖ్యమని పవన్ కుండబద్ధలు కొట్టారు.

మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని విపక్షాలు చేసిన విమర్శలకు మద్దతుగానే ఉన్నట్లుగా ఉందని అంటున్నారు. అలాగే ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా అలాగే ఉంది అని అంటున్నారు.

అయితే పవన్ తాను ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్న సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేయడమేంటి అన్నది కూడా మరో చర్చగా ఉంది. సాటి మంత్రి పనితీరు బాలేదని బాహాటంగా పవన్ చెప్పడం పట్ల అయితే చర్చ సాగుతోంది. ఇపుడు హోం మంత్రి మీదనే అందరి చూపు ఆలోచనలు కూడా పడుతున్నాయని అంటున్నారు. ఆమె పనితీరు ప్రశ్నార్ధకం అయింది అని అంటున్నారు. తాను ఏమి చెప్పదలచుకున్నారో అన్నీ ఓపెన్ గా చెప్పేసిన పవన్ ఒక భారీ వ్యూహంతోనే ఇలా చేశారు అని అంటున్నారు. మరి ఆ వ్యూహం ఏమిటి అన్నది వేచి చూడాల్సిందే.