మన్యంలో ప్రకృతి ప్రేమికుడి కాలినడక... పవన్ కల్యాణ్ వీడియో వైరల్!
అయితే... సహజంగా ప్రకృతి, జంతు ప్రేమికులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు.
By: Tupaki Desk | 20 Dec 2024 11:39 AM GMTనిత్యం రద్దీగా ఉండే రోడ్లు.. కాలుష్యంతో నిండి ఉండే వాతావరణం.. ఎప్పుడూ హడావిడి జీవితం.. ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం.. ఇవన్నీ పట్టణాల్లో బ్రతికే ప్రతీ మనిషి దైనందిన జీవితంలో భాగాలు! వీటికి జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అతీతులు కాదనే అంటారు. రాజకీయాల్లో అయినా, సినిమా షూటింగుల్లో అయినా ఇవన్ని మామూలే!
అయితే... సహజంగా ప్రకృతి, జంతు ప్రేమికులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. ఈ సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన కాన్వాయ్ సాగుతుంటుంది. మరోపక్క చుట్టూ కొండలు, లోయలు కనిపిస్తున్నాయి. పచ్చికబయళ్లు దర్శనమిస్తున్నాయి.
ఇలా చుట్టూ కొండలు, లోయలు, ఎటు చూసినా పచ్చని వాతావరణం కనిపిస్తుండటం.. మరోవైపు వరుణుడు చినికులు కురిపించడంతో పవన్ కల్యాణ్ ఒక్కసారిగా పులకించి పోయినట్లున్నారు. దీంతో... తన కాన్వాయ్ ని ఆప్పించారు.. అనంతరం.. సెక్యూరిటీ గొడుగు పట్టుకోగా.. మెడలో సాలువా కప్పుకుని తనదైన శైలిలో నడక మొదలుపెట్టారు.
ఇలా బయలుదేరిన పవన్ కల్యాణ్ సాలూరు నియోజకవర్గంలోని బాగుజోల గ్రామంలో పర్యటించారు. ఈ సమయంలో అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోపక్క మక్కువ మండలం, కవిరి పల్లి గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకూ కాన్వాయ్ ను వదిలి కాలినడకన వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ మొదలుపెట్టింది.
ఇదే సమయంలో... చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించిన పవన్ కల్యాణ్.. కొండల జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ సందర్భంగా... ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, అడ్వంచర్ టూరిజం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు.
ఈ విధంగా గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ కాలి నడకన పర్యటిస్తు అక్కడి స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లోని అంతర్గత రహదారులను పరిశీలించారు. ఇందులో భాగంగా.. శంబర గ్రామంలో పనికి ఆహార పథకం నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించారు.