Begin typing your search above and press return to search.

పవన్ గిరి గీసుకుని కూర్చున్నారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే పవర్. అటువంటి ఆయనకు ఇపుడు చేతిలోకి పవర్ వచ్చింది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 3:55 AM GMT
పవన్ గిరి గీసుకుని కూర్చున్నారా ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే పవర్. అటువంటి ఆయనకు ఇపుడు చేతిలోకి పవర్ వచ్చింది. దాంతో ఎలాగుండాలి. డబుల్ పవర్ తో వండర్స్ చేయాలి. అలాగే చేస్తారు అని అనుకున్నారు అంతా. కానీ పవన్ తన పరిధిని తానే నిర్ణయించుకున్నారు. తన పరిమితులు తానే విధించుకున్నారు.

నిజానికి చూస్తే టీడీపీ కూటమిలో టీడీపీ తరువాత పెద్ద పార్టీ జనసేన. ఆ మాటకు వస్తే కూటమి కట్టించింది పోటీ చేయించింది, ఎన్నికల్లో కూటమి గెలించేలా తన బలాన్ని ఇంధనంగా మార్చింది అన్నీ పవనే. ఆయన కూటమి విజయానికి ఒక బ్రహ్మాస్త్రంగా మారారు.

అటువంటి పవన్ కళ్యాణ్ కి టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అగ్రాసనమే వేశారు. తాను ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రిగానే అంటూ పక్కనే పెట్టుకున్నారు. పవన్ అడగాలే కానీ బాబు ఏమైనా చేస్తారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో తోటి మిత్ర పక్షానిని ఇంతలా మర్యాద మన్ననా చేసినది జనసేన విషయంలోనే.

పైగా బాబు మీద ఒక ప్రచారం ఉంది. ఆయన అవసరం తీరాక పక్కన పెడతారు అని. కానీ అలా చేయకుండా ప్రభుత్వంలో పవన్ కి ముఖ్య భూమికనే ఇచ్చారు. అయినా సరే పవన్ ఆ స్వేచ్చను చొరవను పూర్తిగా తీసుకోవడం లేదు అని అంటున్నారు. పవన్ కి తాను ఏమిటో తెలుసు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు

ఎన్నికలకు ముందు అనేకసార్లు చంద్రబాబు వద్దకు తానే స్వయంగా వెళ్ళిన పవన్ ఇపుడు మాత్రం పెద్దగా కలవడం లేదు. మంత్రి వర్గ సమావేశాలలో తప్ప మీట్ కావడం లేదు. ఇక ఏదైనా సభలు సమావేశాలు ఉంటే కలుస్తున్నారు. అంతకు మించి ఏమీ చేయడం లేదు. తన పని ఏమిటో తన శాఖ ఏమిటో తన పార్టీ ఏమిటో అన్నట్లుగానే ఉన్నారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు మంత్రులు టీడీపీ వారు. చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడు. ఆ మాట పవనే స్వయంగా అనేక సార్లు అంటూ వచ్చారు. అందుకే ఆయన బాబుని ఆయన మానాన పనిని చేసుకోనీయాలి అని అనుకుంటున్నారు అని చెబుతున్నారు. అందుకే జనసేన వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే పవన్ పొలిటికల్ గా లో ప్రొఫైల్ లో ఉంటున్నారు అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ ని తుఫాను కాదు సునామీ అని కూడా ప్రధాని మోడీ సంభోధించారు. అలాంటిది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు. ఆయన ఢిల్లీ వెళ్తే రాచ మర్యాదలే జరుగుతాయి అన్నది తెలిసిందే.

అయినా ఆయన ఢిల్లీ టూర్లు పెట్టుకోవడం లేదు. సీఎం గా చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఏపీకి సాయం కోసం ఆయన అర్ధిస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా తన పాత్రను పరిమితంగానే చేసుకుని ముందుకు సాగుతున్నారు.

కేంద్ర పెద్దలకూ పవన్ ఈ విధంగా ఇబ్బందులు తేకూడదు అని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ పవన్ మాత్రం తన పంధా తనది అన్నట్లుగా సాగుతున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ గిరి గీసుకుని కూర్చున్నారు అని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో అయినా పవన్ తన పరిధిని విస్తరించుకుంటారా లేక అలాగే శాఖలకే పరిమితం అవుతారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.