అవసరం లేకపోయినా సబ్ స్టేషన్లు... ఇదో రకం కుంభకోణం
గత ఐదేళ్ల పాలనల్లో చోటుచేసుకున్న అక్రమ వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తవ్వితీస్తోంది.
By: Tupaki Desk | 30 Dec 2024 9:38 AM GMTగత ఐదేళ్ల పాలనల్లో చోటుచేసుకున్న అక్రమ వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తవ్వితీస్తోంది. ఇప్పటికే ఇసుక, మద్యం, మైనింగ్ కుంభకోణాలు, భూ కబ్జాలను బయటపెట్టింది. ఇప్పుడు విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ల కుంభకోణం వెలుగుచూసింది. అవసరం లేకపోయినా అదనపు సబ్ స్టేషన్లు నిర్మించి ఉద్యోగాలు, కమీషన్ల కోసం సొంత లాభాలు సంపాదించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సూచనలతో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి నిధులు దోచుకున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖను కొందరు నేతలు తమ జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖ అవసరాలు, నిధుల లభ్యత వంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ సొంత లాభాల కోసం సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారని ప్రభుత్వం గుర్తించింది. వారి సిఫార్సులతో అనుమతించి, నిర్మాణం ప్రారంభంకాని 140 సబ్ స్టేషన్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
సబ్ స్టేషన్ల కాంట్రాక్టులివ్వడం ద్వారా కమీషన్లు, అందులో ఉద్యోగాలను అమ్ముకునేందుకు పెద్ద ఎత్తున అవసరం లేని చోట సబ్ స్టేషన్లు నిర్మాణానికి ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 224 సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.511 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో చాలావరకు అవసరం లేనిచోటే ఉన్నాయని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. దీంతో ఇంకా నిర్మాణం ప్రారంభంకాని 140 సబ్ స్టేషన్లు రద్దు చేసింది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సిఫార్సులతో 68, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ పరిధిలో 30 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు అనుమతించాయి. ఇదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అప్పటి వైసీపీ నేతలు పోటీపడ్డారు. ఒక్కో సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుంది. సరైన అధ్యయనం లేకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటుకు డిస్కంలు అనుమతించాయని గుర్తించిన సర్కారు వాటిని రద్దు చేయడం ద్వారా రూ.350 కోట్లు ఆదా చేసింది.
వాస్తవానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు విద్యుత్ సంస్థలు అధ్యయనం చేస్తాయి. విద్యుత్ లోడ్ ఎక్కువ కావడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే సబ్ స్టేషన్లను గుర్తించి వాటి సామర్థ్యం పెంచడం లేదా, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలిస్తాయి. ఈ ప్రకారం రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక 2020-24ను రూపొందించాయి. విద్యుత్ సంస్థల దగ్గర అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా ప్రణాళిక రూపొందించి, వాటి అమలుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలో గత ఐదేళ్లలో రూ.1891 కోట్లతో 927 సబ్ స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటితోపాటు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సంతృప్తి పరిచేందుకు అదనంగా మరో 350 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు అనుమతించాయి. దీనివల్ల డిస్కంలపై అదనంగా రూ.875 కోట్లు భారం పడుతుంది. సుమారు రూ.1.12 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు ఇది అదనపు భారం.
గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకు, కమీషన్ల వసూళ్లకు సబ్ స్టేషన్లను నిర్మించాలని అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక్కో సబ్ స్టేషనులో నాలుగు ఆపరేటర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు రూ.7 నుంచి రూ.10 లక్షలకు ఆయా పోస్టులను అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కో సబ్ స్టేషనుకు స్థానిక ఎమ్మెల్యేలకు రూ.కోటి వరకు లాభం వస్తే సబ్ స్టేషన్ల నిర్మాణం, నిర్వహణకు డిస్కంలు ప్రజలపై అదనపు భారం మోపాయి. వీటి ఏర్పాటు కోసం డిస్కంలు ఖర్చు చేసే డబ్బును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తుంటారు. దీంతో వైసీపీ నేతల అవినీతికి ప్రజలు భారం మోయాల్సివచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది.