ఆర్జీవీకి వడ్డీతో కలిపి షాకిచ్చిన ఫైబర్ నెట్... వాట్ నెక్స్ట్?
ఇందులో భాగంగా... 'వ్యూహం' సినిమా కోసం రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీస్ పంపించింది.
By: Tupaki Desk | 21 Dec 2024 12:07 PM GMT'వ్యూహం' సినిమాకు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ చెల్లింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో ఓ న్యూస్ ఛానల్ లో కథనాలు రాగా.. వాటికి ఎక్స్ వేదికగా ఆర్జీవీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అవును... సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమాకు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా లబ్ధి చేకూరిందనే ఆరోపణలు ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జలక్ ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక నోటీసులు పంపించింది.
ఇందులో భాగంగా... 'వ్యూహం' సినిమా కోసం రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీస్ పంపించింది. ఈ సందర్భంగా... 'వ్యూహం' సినిమాకు వ్యూస్ లేనప్పటికీ ఫైబర్ నెట్ రూ.1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందటంపై లీగల్ నోటీసులు ఇచ్చింది.
ఈ క్రమంలో... ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు 5 మందికి నోటీసులు జారీ చేశారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు గానూ పదిహేను రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశించారని తెలుస్తోంది. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
జగన్ కు ఆర్జీవీ బర్త్ డే విషెస్!:
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా... సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ.. జగన్ కు విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా... "వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైఎస్ జగన్ గారూ" అని మొదలుపెట్టిన ఆర్జీవీ... “రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.