ఫైబర్ నెట్ వివాదంలో అనూహ్య మలుపులు.. క్రమశిక్షణ లేకపోతే శిక్షే..
ఎండీ దినేష్ కుమార్ పై చైర్మన్ జీవీ రెడ్డి బహిరంగ విమర్శలు చేసిన తర్వాత ప్రభుత్వం ఈ వివాదంపై సీరియసుగా ఫోకస్ చేసింది.
By: Tupaki Desk | 24 Feb 2025 5:04 PM GMTఏపీ ఫైబర్ నెట్ వివాదంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. ఎండీ దినేష్ కుమార్ పై చైర్మన్ జీవీ రెడ్డి బహిరంగ విమర్శలు చేసిన తర్వాత ప్రభుత్వం ఈ వివాదంపై సీరియసుగా ఫోకస్ చేసింది. మంత్రి బీవీ జనార్దన్ రెడ్డిని రంగంలోకి దింపి వాస్తవాలు తెలుసుకోవాలని ఆదేశించింది. ఇక మరోవైపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను తక్షణం ఆమోదించిన ప్రభుత్వం, ఆ వెంటనే ఎండీ దినేష్ కుమార్ పైనా బదిలీ వేటు వేసింది. దీంతో ప్రభుత్వం, పార్టీ ఎక్కడైనా క్రమశిక్షణ కట్టుతప్పితే చర్యలు తప్పవనే సంకేతాలు పంపింది కూటమి ప్రభుత్వం..
ఫైబర్ నెట్ వివాదానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. చైర్మన్, ఎండీ మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో ఆ ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించింది. ముందుగా టీడీపీ సభ్యత్వానికి, చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయనే చర్చ జరుగుతుండగానే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవీ రెడ్డి రాజీనామాను తక్షణం ఆమోదించి ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబుకు అందిన నివేదిక ప్రకారం ఎండీ దినేష్ కుమార్ ను సైతం బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఈ వివాదం ద్వారా ప్రభుత్వం పరువు తీశారని ఇద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన ఆగ్రహ ఫలితమే చైర్మన్ రాజీనామా చేయాల్సిరాగా, ఎండీపై వేటు పడిందని అంటున్నారు. ఈ చర్య పార్టీలో మిగిలిన నాయకులు, ప్రభుత్వ అధికారులకు ఓ హెచ్చరికగా చెబుతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడతామంటే కుదరదని పార్టీ వర్గాలకు సంకేతాలు పంపడంతోపాటు గత ప్రభుత్వ నిర్వాకానికి కొనసాగింపుగా పనిచేస్తామంటే సహించేది లేదని అధికార వర్గాలను హెచ్చరించినట్లైంది. ఈ చర్యల ద్వారా ఫైబర్ నెట్ వివాదానికి ప్రభుత్వం ముగింపు పలికింది.