తిరుపతి ఘటన... మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం!
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
By: Tupaki Desk | 9 Jan 2025 7:15 AM GMTతిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ సమయంలో క్షతగాత్రులు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ సమయంలో మృతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
అవును... తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. ఇదే సమయంలో.. స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన అనగాని సత్యప్రసాద్.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకూ కారణం ఏమిటనేది విచారణలో వెల్లడవుతుందని.. తొందరపాటు చర్యే కారణమా.. లేక, సమన్వయ లోపమే కారణమా అనేది తేలుతుందని అన్నారు.