Begin typing your search above and press return to search.

బాబు మార్క్ బడ్జెట్....రెండూ చూసుకుంటూ !

దాదాపుగా ఆరున్నరేళ్ల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 7:30 PM GMT
బాబు మార్క్ బడ్జెట్....రెండూ చూసుకుంటూ !
X

దాదాపుగా ఆరున్నరేళ్ల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. 2018లో పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెట్టిన బాబు ప్రభుత్వం 2019లో మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని సమర్పించి దిగిపోయింది.

ఇక 2024లో మళ్లీ నెగ్గిన చంద్రబాబు కూటమి మిత్రులతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే జూన్ 12న ప్రమాణం చేసిన కూటమి ప్రభుత్వం గడచిన అయిదు నెలలుగా బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదు. అదే సమయంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే మరోసారి ప్రవేశ పెట్టింది. అలా కొత్త ప్రభుత్వం వస్తూనే ఓటాన్ అకౌంట్ వైపుగా వెళ్లడం ఒక విశేషంగానే చెప్పుకున్నారు.

దాని మీద వైసీపీ రాజకీయ విమర్శలు చేసింది. బడ్జెట్ ని కూడా పూర్తిగా ప్రవేశపెట్టలేని కూటమి సర్కార్ అని నిందించారు. ఇక అటూ ఇటూ మాటలు ఎన్ని అనుకున్నా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు మాత్రం ఏ విధంగానూ తొందర పడలేదు. ఆయన అన్నీ అనుకున్నట్లుగానే చేసుకుని వెళ్లారు

ఇపుడు తగిన సమయం వచ్చిందని ఆయన పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ డిసెంబర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఉంటుంది. అంటే నాలుగు నెలలకు మాత్రమే. పూర్తి వార్షిక బడ్జెట్ అంటే మూడు లక్షల దాకా బడ్జెట్ అంచనా ఉంటుందని చెబుతున్నారు. అందులో మూడవ వంతు కాబట్టి లక్ష కోట్లతో బడ్జెట్ ఉండొచ్చు అని అంటున్నారు.

అది 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఉండొచ్చు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక ఈ బడ్జెట్ ని ఫుల్ మీల్స్ గానే తీసుకుని రాబోతున్నారు అని అంటున్నారు. ఇక అమరావతి పోలవరం వంటి వాటి విషయంలో పూర్తి వివరాలు చెబుతూ ఎపుడు పూర్తి చేస్తామో కూడా ఈ బడ్జెట్ ద్వారా చెప్పబోతున్నారు అని అంటున్నారు

బడ్జెట్ ప్రవేశపెట్టే వేళకు పోలవరానికి ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంక్ నిధులు కూడా దక్కబోతునాయి. దాంతో అమరావతి రాజధానిని ఎన్ని వేల కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నామని చెబుతారు. అలాగే ఎన్ని దశలలో పూర్తి చేస్తామని కూడా వివరించే ప్రయత్నం ఉంటుంది అని అంటున్నారు.

దానికి అయ్యే ఖర్చుని వివరిస్తూనే ఏ విధంగా నిధుల సమీకరణ ఉంటుంది, కేటాయింపులు ప్రభుత్వం తరఫున లేదా ఫైనాన్షియల్ ఏజెన్సీల నుంచి వస్తుంది అన్నది కూడా వివరిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అతి పెద్ద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాంది పలుకుతోంది అన్నది కచ్చితంగా చెప్పనున్నారు. ఇది బడ్జెట్ లో టాప్ ప్రయారిటీగా హైలెట్ గా ఉండబోతోంది.

మరో వైపు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి లాంటిది. దానికి కూడా కేంద్రం ఇటీవలనే 12 వేల కోట్ల రూపాయల దాకా బ్యాక్ లాగ్ నిధులను విడుదల చేసింది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బడ్జెట్ నుంచి ఏటా కనీసం రెండు వేల కోట్లకు తక్కువ కాకుండా కేటాయింపులు చేస్తూ ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేస్తామని కూడా చెప్పబోతున్నారు అంటున్నారు.

ఇక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలతో ఫ్యూచర్ ప్లాన్స్ తో బడ్జెట్ లో చాలా విషయాలే ఉండబోతున్నాయని తెలుస్తోంది. అలాగే సంక్షేమానికి కూడా బడ్జెట్ లో పెద్ద పీట వేయబోతున్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ లో రెండు హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మిగిలిన వాటి గురించి కచ్చితంగా చెబుతుందని అంటున్నారు.

అలాగే వాటికి నిధులను ఏ మేరకు కేటాయిస్తుందో ఒక అంచనా కూడా ఈ బడ్జెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఏపీలో ఉన్న అప్పులను కూడా వివరించే ప్రయత్నం బడ్జెట్ ద్వారా చేస్తారని వాటికి కడుతున్న వడ్డీలు ఎంత మేరకు ఉన్నాయో ఏపీలోని పౌరులకు తెలియచేస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేసేలాగానే చూస్తుందని అంటున్నారు.