Begin typing your search above and press return to search.

వదల బొమ్మాళి వదల.. చంద్రబాబును అరెస్టు చేసిన అధికారిపై యాక్షన్

టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును గతంలో అరెస్టు చేసిన సీఐడీ మాజీ డీజీ సంజయ్ కు చిక్కులు ఎక్కువయ్యాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2024 7:21 AM GMT
వదల బొమ్మాళి వదల.. చంద్రబాబును అరెస్టు చేసిన అధికారిపై యాక్షన్
X

టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును గతంలో అరెస్టు చేసిన సీఐడీ మాజీ డీజీ సంజయ్ కు చిక్కులు ఎక్కువయ్యాయి. అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఆయన ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో మాజీ డీజీ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉండగా, ఆయన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కు అనుమతివ్వడంతో సంజయ్ కు కష్టాలు తప్పేలా లేవంటున్నారు.

గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేసిన సంజయ్ అధికార దుర్వనియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసు అధికారులు క్రమశిక్షణ చట్టం 1969లోని సెక్షన్ 3(1) కింద చర్యలు తీసుకుంది. సంజయ్ పై విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. అయితే అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో డీజీ స్థాయి అధికారిని విచారించాలంటే ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏసీబీ లేఖ రాయడంతో సంజయ్ ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో సంజయ్ పై ఉచ్చుబిగించేందుకు ఏసీబీకి లైన్ క్లియర్ అయినట్లైంది. అంతేకాకుండా అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ సీనియర్ పోలీసు అధికారి విజయవాడ దాటి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. తాజా ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు సంజయ్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

గత ప్రభుత్వంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సంజయ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. అగ్ని ఎన్వోసీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల అమలులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వంలో అగ్ని పోర్టల్ ఎన్వోసీలు, హార్డ్ వేర్ సరఫరా కోసం రూ.2.29 కోట్లకు సౌత్రికా టెక్నాలజీ అండ్ ప్రైవేటు లిమిటెడ్ తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో సదరు కంపెనీకి ముందుగా రూ.59.93 లక్షలు చెల్లించారని, నెల రోజుల్లో కేవలం 14 శాతం ప్రాజెక్టు పనులు మాత్రమే పూర్తి చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ లాప్ ట్యాప్, యాపిల్ ఐ ప్యాడ్ వంటి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ను నేరుగా కొనుగోలు చేశారని గుర్తించింది. టెండర్ లేకుండా ఇలా నేరుగా కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి 17.89 లక్షల నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ అక్రమాలను తవ్వితీయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయనకు చిక్కులు తప్పేలా లేవంటున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు సమయంలో సంజయ్ కీలకపాత్ర పోషించారు. చంద్రబాబును విచారణకు పిలవకుండానే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అప్పటి అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్లు నిర్వహించారు. దీంతో ఆయన టీడీపీకి టార్గెట్గా మారారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఆదేశాలివ్వడమే కాకుండా రాజకీయ నాయకుడి తరహాలో మీడియా సమావేశాలు నిర్వహించడంతో విమర్శలు పాలయ్యారు. నాటి యాక్షన్ కు కొనసాగింపుగానే ఇప్పుడు ఆయనపై రియాక్షన్ ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా చంద్రబాబును అరెస్టు చేయడమే నేడు సంజయ్ కి ఈ కష్టాలు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు.