వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల గుట్టు విప్పాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ కేసు దర్యాప్తులో ముందడుగు వేసింది.
By: Tupaki Desk | 8 March 2025 12:20 PM ISTప్రభుత్వం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ కేసు దర్యాప్తులో ముందడుగు వేసింది. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పదంగా మరణిస్తున్నారని.. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
ఇప్పటికే మరణించిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోయినా, అనారోగ్యంతో మరణించారన్న నివేదికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వాచ్‌మన్ రంగన్న మరణాన్ని అనుమానాస్పదంగా భావిస్తూ ఈ కేసులోని కుట్రకోణాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ప్రత్యేకంగా ఆహ్వానించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలిపించటం ఇదే తొలిసారి.
-పవన్ కల్యాణ్ స్పందన
వివేకా హత్య కేసులో వరుసగా సాక్షులు మరణించడం పలు అనుమానాలకు కారణమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దీనిపై సత్వర చర్యలు తీసుకుని, మరణించిన సాక్షుల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
-సాక్షుల మరణాలపై సమగ్ర విచారణ
ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న అనుమానితులు కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డ్రైవర్ నారాయణయాదవ్, కల్లూరి గంగాధర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, డా. వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్ రంగన్న మరణించారని, వీరి మరణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని డీజీపీ మంత్రివర్గ సమావేశంలో వివరించారు. ప్రాథమిక విచారణలో వాచ్‌మన్ రంగన్న మరణంపై కొన్ని కీలక ఆధారాలు లభించాయని, పూర్తిస్థాయి నివేదికను త్వరలో అందజేస్తామని తెలిపారు. అలాగే, రంగన్న మరణంలో పోలీసుల ప్రమేయం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపైనూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు.