ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆ సమస్య లేదు!
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 14 Nov 2024 4:18 AM GMTఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నిబంధనని తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేశారు. ఈ మేరకు బుధవారం దీనికి సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు!
అవును... ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ.. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో... ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అని అంటున్నారు.
వాస్తవానికి 1994లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలో పోటీకి అనర్హులంటూ చట్టం చేశారు. అయితే... ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల రేటు పెరగడం అనే విషయాలు ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో నూ ఆందోళన కలిగిస్తోంది.
ఇందులో భాగంగా.. ప్రసుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి సామర్థ్య రేటు (టీ.ఎఫ్.ఆర్.) 2001లో 2.6 శాతం నుంచి ఇటీవల కాలంలో 1.5 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో... సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ అమోదించింది.