Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాలు..కూటమి భారీ కసరత్తు !

విభజన ఏపీలో 13 జిల్లాలే ఉండేవి. అవి కూడా 1978లో చివరిసారి విజయనగరం జిల్లా ఏర్పాటు తరువాత మళ్ళీ కొత్తగా ఏదీ ఏర్పడింది కాదు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:54 AM IST
ఏపీలో కొత్త జిల్లాలు..కూటమి భారీ కసరత్తు !
X

విభజన ఏపీలో 13 జిల్లాలే ఉండేవి. అవి కూడా 1978లో చివరిసారి విజయనగరం జిల్లా ఏర్పాటు తరువాత మళ్ళీ కొత్తగా ఏదీ ఏర్పడింది కాదు. దాంతో విభజన తరువాత కొత్త జిల్లాలు కావాలన్న డిమాండ్ వచ్చింది. కానీ టీడీపీ తొలి విడత అధికారంలో చేయలేకపోయింది. టీడీపీకి ఈ విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దాంతో నెమ్మదిగా చేద్దామనుకునేలోపే 2019లో అధికారం చేజారింది.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే దీని మీద కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. శాస్త్రీయ విభజన అయితే జరగలేదని కూడా అన్నారు. వైసీపీ ఓటమిలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజానీకం అసంతృప్తి కూడా బలంగా పనిచేసింది అని చెప్పవచ్చు.

ఇక దానిని పట్టుకున్న టీడీపీ ఎన్నికల వేళ కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. అంతే కాదు వైసీపీ చేసిన కొత్త జిల్లాల వల్ల ఏర్పడిన అన్యాయం మీద కూడా శ్రద్ధ వహించి సరిచేస్తామని పేర్కొంది. అలా చూస్తే చాలా డిమాండ్లే కూటమి ప్రభుత్వం ముందు ఉన్నాయి.

అయితే ఇపుడు అర్జంటుగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. అందులో ఒకటి రంపచోడవరం కేంద్రంగా జిల్లా. రంపచోడవరం గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని తెచ్చి ఏకంగా అయిదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం కలిపింది.

అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా రంపచోడవరం ఉండేది. ఆనాడు జిల్లా కేంద్రానికి ఇంత దూరం అయితే లేదు. ఈ విభజనతో పాడేరుకి రంపచోడవరం ప్రజలు వెళ్ళాలీ అంటే చాలా కష్టమైపోతోంది. అయిదు వందల కిలోమీటర్ల దూరంలో పాడేరు జిల్లా కేంద్రం ఉంది. దాంతో తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయమని కోరుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రంపచోడవరం కొత్త జిల్లాగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. అల్లూరి జిల్లాలో కలపడం వల్ల స్థానికులకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఆమె అన్నారు. మంత్రిగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు కాబట్టి ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తుంది అని అంటున్నారు.

అలాగే మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరుతున్నారు. కొత్త జిల్లా కచ్చితంగా ఏర్పాటు అవుతుందని మంత్రి నారాయణ దీని మీద హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఎన్నికల్లో కూటమి పెద్దలు ఈ మేరకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా కావాలన్న డిమాండ్ సుదీర్ఘమైనదిగా ఉంది. దీని మీద కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే ఈ రెండు జిల్లాలేనా ఇంకా ఏమైనా వస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఏపీలో చూస్తే అనేక ప్రాంతాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల మార్పు కోరుతున్నారు. అలాగే రెవిన్యూ డివిజన్లు కొత్తవి కోరుతున్నారు. పాత వాటిలో మార్పు కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల హామీని తీర్చేందుకు సీరియస్ గానే చూస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. అందులో గిరిజన ప్రాంతంలో మూడవ జిల్లా రావడం ఖాయంగా ఉంది. అలాగే మరో రెండు మూడు కొత్త జిల్లాలు కలుపుకుని ముప్పయికి ఈ సంఖ్య చేరుతుందా అన్నదే చర్చనీయాంశంగా ఉంది.