Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ సంచలనం : వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు

ఒక క్లిక్ తో ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లు క్షణాల్లోనే తీసుకోవచ్చునని ప్రభుత్వం తెలియజేసింది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 12:37 PM GMT
ఏపీ ప్రభుత్వ సంచలనం : వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు
X

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 30 గురువారం నుంచి వాట్సాప్ గవర్నెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరులోనే వాట్సాప్ మేనేజింగ్ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం సాంకేతిక మార్పులు పూర్తి చేసింది. దీంతో గురువారం నుంచి 8 శాఖల పరిధిలోని 161 రకాల సేవలు వాట్సాప్ లోనే అందుబాటులో ఉంటాయి. ఒక క్లిక్ తో ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లు క్షణాల్లోనే తీసుకోవచ్చునని ప్రభుత్వం తెలియజేసింది.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఆర్టీసీ బస్సు పాసుల కోసం రోజుల తరబడి సమయం వెచ్చించాల్సివస్తుందని, దీనివల్ల సమయాభావంతోపాటు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నామని చెప్పుకున్నారు. ఈ సమస్యను గుర్తుపెట్టుకున్న యువనేత లోకేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలకు అవసరమైన సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

అక్టోబరులో మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం వాట్సాప్ గవర్నెస్ ను అందుబాటులోకి తెస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం ఇకపై దేవాదాయ, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 161 పౌర సేవలు ఒక క్లిక్ తోనే అందుబాటులోకి రానున్నాయి.

గతంలో క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే మూడు ఆఫీసులు, న‌లుగురు అధికారులను కలవాల్సివచ్చేది. ఇక క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లుల చెల్లించాలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెస్ అందుబాటులోకి రావడంతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.