Begin typing your search above and press return to search.

ఈ రచ్చేంది చంద్రబాబు? మద్యం షాపు పెట్టే ముందు ఎమ్మెల్యేను కలవాలా?

పేరుకు మాత్రమే క్లీన్ చిట్ ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారే తప్పించి.. చేతల్లోకి వస్తే మాత్రం ఇదేం అరాచకం?

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:53 AM GMT
ఈ రచ్చేంది చంద్రబాబు? మద్యం షాపు పెట్టే ముందు ఎమ్మెల్యేను కలవాలా?
X

పేరుకు మాత్రమే క్లీన్ చిట్ ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారే తప్పించి.. చేతల్లోకి వస్తే మాత్రం ఇదేం అరాచకం? అన్నట్లుగా ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఉందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఎప్పుడూ రాని ఆరోపణలు.. సీరియస్ విమర్శలు లిక్కర్ షాపుల వేలం సందర్భంగా రావటం తెలిసిందే. మొత్తానికి మద్యం షాపుల వేలం ప్రక్రియ పూర్తి కావటం.. ఈ రోజు నుంచి షాపులు ఓపెన్ అవుతుండటం తెలిసిందే. అయితే.. మద్యం షాపుల లాటరీల్లో లక్కీగా దక్కించుకున్న వారికి ఎక్సైజ్ అధికారులు షాకుల మీద షాకులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

లాటరీలో లిక్కర్ షాపులని సొంతం చేసుకోగానే సంతోషపడటం కాదని.. స్థానిక ఎమ్మెల్యే అభయ హస్తం అవసరమన్న విషయాన్ని ఎక్సైజ్ అధికారులు నొక్కి చెబుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణలో కూడా ఈ తరహా పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. లాటరీ విధానంలో మద్యం షాపుల్ని దక్కించుకోవటానికి దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా అనుమతి ఇచ్చిన చంద్రబాబు సర్కారు కారణంగా వివిధ రాష్ట్రాల వారు అప్లికేషన్లు పెట్టుకోవటం.. లాటరీలో షాపుల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

నియామక పత్రాలు ఇచ్చే వేళలో మద్యం షాపుల్ని సొంతం చేసుకున్న యజమానులకు ఎక్సైజ్ పోలీసులు తమదైన శైలిలో ఇస్తున్న కౌన్సెలింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారులకు సమర్పించాల్సిన పత్రాల్ని సమర్పించటం.. స్టాక్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత.. సరుకు తీసుకెళ్లే వేళకు ముందుగా ఏమేం చేయాలో చెప్పేస్తున్న అధికారులు.. స్థానిక ఎమ్మెల్యే దర్శనం చేసుకున్నారా? వారితో మాట్లాడారా? అన్న ప్రశ్న పదే పదే అడగటం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్ సమాచారం ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు కనీసం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అలాంటి కమిట్ మెంట్ ఏమీ లేకుండా షాపులు ఓపెన్ చేస్తే.. సాఫీగా వ్యాపారం చేసుకోవటం సాధ్యం కాదన్న మాటను స్థానిక ఎమ్మెల్యేలకు చెందిన ముఖ్యలు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త మాటదెబ్బకు లాటరీలో షాపుల్ని దక్కించుకున్న వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఇదేం దందా సామీ అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే లిక్కర్ షాపుల అప్లికేషన్ల సమయంలోనూ ఎమ్మెల్యేలు పలువురు వ్యవహరించిన తీరుపై పెద్ద చర్చే జరుగుతుంది. ఇలాంటి వేళ.. ఈ తరహా పంచాయితీలు ఏపీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తాయని.. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.