రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో 40 జారీ చేశారు.
By: Tupaki Desk | 31 Dec 2024 11:14 AM GMTనూతన సంవత్సరం నుంచి మరో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 బుధవారం నుంచి ఈ పథకం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అమలు చేయనుంది.
కొత్త సంవత్సరంగా ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ప్రకటించిన మధ్యాహ్న భోజన పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బుధవారం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఇందుకోసం రూ.115 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం వల్ల పేదరికంతో బాధపడుతున్న విద్యార్థులు ఎలాంటి చింతా లేకుండా కాలేజీలకు వచ్చి చదువుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవానికి 2014-19 మధ్య కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో ఈ పథకాన్ని నిలిపేసింది. కరోనా తగ్గినా మళ్లీ పునరుద్ధరించలేదు. దీంతో కాలేజీ దశలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో మళ్లీ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో 40 జారీ చేశారు.
ఈ పథకం కింద కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం భోజనం పెట్టనున్నారు. విద్యార్థి దశ నుంచి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చడంతోపాటు పోషకాహార సమస్యలను నివారించేందుకు మధ్యాహ్న భోజనం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం ఈ విద్యాసంవత్సరానికి రూ.29.39 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించగా, ఆ మొత్తాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా వచ్చే విద్యాసంవత్సరానికి కూడా రూ.85.84 కోట్లు కేటాయించింది.