Begin typing your search above and press return to search.

లడ్డూ ఇష్యూ : టీటీడీ చైర్మన్ గా ఎవరో ?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఇపుడు ఎవరు తీసుకుంటారో అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:48 AM GMT
లడ్డూ ఇష్యూ : టీటీడీ చైర్మన్ గా ఎవరో ?
X

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఇపుడు ఎవరు తీసుకుంటారో అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే శ్రీవారి లడ్డూ ఇష్యూ ఒక ఆరని మంటగా సాగుతోంది. గత ప్రభుత్వం అయిదేళ్ల పాటు అన్నీ అపచారాలు చేసింది అని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అంతా తమ ఇష్టారాజ్యంగా చేస్తూ పోయిందని కూడా అంటోంది.

ఆ విషయం అలా ఉంచితే లడ్డూ ఇష్యూ తరువాత టీటీడీ మీద అందరి ఫోకస్ పడింది. ప్రపంచమంతా ఇపుడు టీటీడీ మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. కేంద్రం కూడా టీటీడీ చైర్మన్ విషయంలో ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది.

దాంతో ఇప్పటిదాకా వచ్చిన పేర్లు కానీ ఎవరికో మీడియా అధిపతికి ఇస్తారని వస్తున్న వార్తలు కానీ అమలు అయ్యే అవకాశాలు లేవు అనే అంటున్నారు. అవి ఉత్తి ప్రచారానికే పరిమితం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

తిరుమల ఆచారాలు అని గట్టిగా చెబుతూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇపుడు అక్కడ సరైన వారిని ఎంపిక చేయకపోతే విమర్శల పాలు అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. అంతే కాదు రానున్న కాలమంతా టీటీడీ మీదనే అందరి కళ్ళూ ఉండడం ఖాయం అని అంటున్నారు.

ఇక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని వైసీపీ ప్రభుత్వం మార్చేసింది అని చంద్రబాబు అరోపించారు. దాంతో రాజకీయ వాసనలు ఉన్న వారికి కూడా ఆ పదవిని ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అలా ఆశలు పెట్టుకున్న చాలా మందికి కూడా లడ్డూ ఇష్యూ తరువాత తిరుమల వ్యవహారం తలకెత్తుకోవడం పవిత్రమైన బాధ్యత అని తమకు అంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా అని వారికి వారే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే టీటీడీకి జంబో జెట్ మాదిరిగా యాభై మందికి పెంచేసి పాలక వర్గాన్ని పెద్ద సంఖ్యలో తీసుకున్నారు అని కూడా కూటమి వైసీపీ మీద ఆక్షేపిస్తోంది. అందువల్ల అంత పెద్ద సంఖ్యలో పాలక మండలి కూడా ఉండే అవకాశాలు లేవు.

దాంతో పాటు భక్తి ఉన్న వారిని తిరుమల ఆచారాల పట్ల అవగాహన ఉన్న వారికీ చాన్స్ ఇవ్వాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. అంతే కాదు టీటీడీని ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ కూడా ముందుకు వస్తోంది. ఈ డిమాండ్ ని ధార్మిక సంస్థలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద లడ్డూ ఇష్యూ కాదు కానీ ఈ పదవి వైపు చూసేందుకు కూడా చాలా మంది సాహసించే పరిస్థితి కూడా అయిపోయింది అని అంటున్నారు.