ఏపీ అధినేతల నోట హైడ్రా మాట!
తెలంగాణలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ మాదిరి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఏపీకి చెందిన నేతల నోటి నుంచి పదే పదే వస్తోంది.
By: Tupaki Desk | 5 Sep 2024 2:30 AM GMTతెలంగాణలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ మాదిరి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఏపీకి చెందిన నేతల నోటి నుంచి పదే పదే వస్తోంది. తాజాగా ఈ రోజు ఇద్దరు అధినేతల నోటి నుంచి హైడ్రా ప్రస్తావన రావటం గమనార్హం. ఏపీని ముంచెత్తిన వరదలతో విజయవాడతో పాటు..గుంటూరుజిల్లాలోని పలు ప్రాంతాల తాజాదుస్థితికి కారణం.. అక్రమ నిర్మాణాలు.. చెరువుల్ని ఆక్రమించుకోవటమేనని చెబుతున్నారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మాటల్లో హైడ్రా ప్రస్తావన చేశారు. హైడ్రాను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పని చేశారని.. ఏపీలోనూ హైడ్రా తరహాలో వ్యవస్థను తీసుకురావాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చిస్తామని వ్యాఖ్యానించారు.
మరోవైపు హైడ్రా గురించి ఏపీ పీసీసీ రథసారధి వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు. విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన ఆమె.. వరద బాధితుల్ని పరామర్శించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పటం మంచి విషయమన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలన్న ఆమె.. ‘తెలంగాణలో హైడ్రా మాదిరి.. బుడమేరు ఆక్రమణల్ని తొలగించాలి. కొంప కొల్లేరు అయ్యింది. బెజవాడ బుడమేరు అయ్యింది. విజయవాడ వరదలకు బుడమేరే కారణం. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలి. బుడమేరుకు రిటర్నింగ్ వాల్ కట్టాలి. వరదల్లో ఇప్పటివరకు 35 మంది చనిపోయారు. 5 లక్షల మంది నష్టపోయారు. ఇది జాతీయ విపత్తు’’ అని వ్యాఖ్యానించారు.
ఇంత నష్టం జరిగినప్పటికి ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదని.. ఏపీకి పరిహారాన్ని ప్రకటించలేదన్నారు. వరదల కారణంగా ఏపీలో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.లక్ష సాయం చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. మరి.. దీనికి కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.