భారీగా అనర్హులు...పెన్షన్ కట్
సామాజిక పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది.
By: Tupaki Desk | 16 Jan 2025 4:14 AM GMTసామాజిక పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలను పెన్షన్ గా అందించే ఏకైక స్టేట్ గా ఏపీ నిలిచింది. దీని కోసం వేలాది కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు అవుతున్నాయి.
అయితే అర్హులు ఎంతమంది ఉన్నా పెన్షన్లు ఎంత మొత్తం అయినా ఇచ్చే విషయంలో తప్పు లేదు. కానీ అనర్హులు పెన్షనర్లుగా ఉంటే మాత్రం అది ప్రజా ధనం వృధా కింద లెక్క. అంతే కాదు చాలా మంది అర్హులకు అన్యాయం జరిగినట్లుగా కూడా చూడాలి.
ఈ నేపధ్యంలో అనర్హులను భోగస్ లబ్దిదారులను ఏరివేసేందుకు కూటమి సర్కార్ ఆ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఇది రాండం చెకప్ గా సాగిన సర్వేగా ఉంది. అయితే ఈ సర్వేలోనే భారీగా అనర్హులు ఉన్నట్లుగా తేలింది.
అందులో ఎక్కువ శాతం కేసులు వికలాంగుల కోటాలోనే అని కూడా సర్వే నివేదికలో తేలింది అని అంటున్నారు. దాంతో ప్రభుత్వం ఇపుడు పూర్తి స్థాయి సర్వేను నిర్వహించాలని డిసైడ్ అయింది అని అంటున్నారు. ఇక ఈ సర్వే నివేదికను చూస్తే కనుక తక్కువ మోతాదులో వికలాంగత్వం ఉన్నా కూడా ఎక్కువగా ఉన్నట్లుగా రాయించుకుని పెన్షన్లు పొందుతున్నారని అంటున్నారు.
ఇక ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలుగా ఇస్తోంది. అదే సమయంలో వికలాంగులకు ఆరు వేలు నెలకు చెల్లిస్తోంది. దీర్ఘ కాల వ్యాధిగ్రస్తులకు అయి మంచాన పట్టిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు. అంతే కాదు పక్షవాతంతో బాధపడేవారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దాంతో ఈ పెన్షన్లలో బాగా భోగస్ లెక్కలు ఉన్నాయని అంటున్నారు.
ఈ నేపధ్యంలో అసలు లెక్కను తేల్చే పనిలో ప్రభుత్వం పడింది. దీని కోసం ప్రత్యేక సర్వేతో ప్రత్యేక వైద్య బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి చాలా పకడ్బందీగా సర్వే జరుగుతుందని అంటున్నారు. ఆరు దశలుగా ఈ వికలాంగుల పెన్షన్ లబ్దిదారులకు వైద్య పరీక్షలు జరిపి అందులో అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం గట్టిగానే ఉంది.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. చాలా మంది ఏపీలో ఉండకుండానే పెన్షన్ తీసుకుంటున్నారు. వారు ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. అంతే కాదు ఇతర దేశాలలో కూడా ఉన్నారు. దాంతో వారిని గుర్తించి పెన్షన్ కట్ చేయాలని కూడా చూస్తున్నారు. మొత్తానికి కొత్తగా పెన్షన్ కోసం అర్హులు చాలా మంది ఉన్నారు. ముందు అనర్హులను బయటకు తీస్తే అర్హులకు అవకాశం ఉంటుందని అంటున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఈ విషయంలో రావడంతో సీరియస్ గానే ఈ ప్రక్రియ సాగుతుందని అంటున్నారు.