Begin typing your search above and press return to search.

జగన్ డిసైడ్ చేసిన పేరు మార్చిన చంద్రబాబు సర్కార్

తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించింది ఏపీలోని కూటమి సర్కారు.

By:  Tupaki Desk   |   18 March 2025 12:55 PM IST
జగన్ డిసైడ్ చేసిన పేరు మార్చిన చంద్రబాబు సర్కార్
X

ప్రభుత్వాలు మారినంతనే తమ పొలిటికల్ ఎజెండాకు తగినట్లుగా పేర్లు మార్చటం తెలిసిందే. పలుమార్లు ఈ అంశం వివాదాస్పదంగా మారటం.. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉండటం తెలిసిందే. పేరు మార్పు వ్యవహారంలో అధికార పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుందన్న అభిప్రాయం ఉంటుంది. ప్రజల భావోద్వేగాలకు భిన్నంగా తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా వ్యవహరిస్తాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించింది ఏపీలోని కూటమి సర్కారు.

ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తూ.. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరి చేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ క్రమంలో తమ నుంచి ఎలాంటి తప్పు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనం కనిపిస్తుంటుంది. ఏపీలోని కూటమి సర్కారు వైఎస్సార్ జిల్లా పేరుకు.. గతంలో ఉన్న కడప పేరును మళ్లీ చేరుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేరును అలానే ఉంచేసి.. గతంలోని పాత పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. కడప పేరును కానీ.. ఆ జిల్లాకు చెందిన మహానేత వైఎస్సార్ ను కానీ విడదీసి చూడలేని పరిస్థితి. అదే సమయంలో ఒక పేరు మీద ఎక్కువ అభిమానాన్ని చూపుతూ.. మరో పేరును తక్కువ చేయటంలోనూ అర్థం లేదు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్ కడప జిల్లా పేరును కంటిన్యూ చేసింది.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మాత్రం.. జిల్లా పేరులోని ‘‘కడప’’ పేరును తొలగించి.. వైఎస్సార్ పేరును మాత్రమే ఉంచేశారు. రెండు పర్యాయాలు ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారన్న సంగతి తెలిసిందే. హెలికాఫ్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించిన వైఎస్ పేరును కడప జిల్లా పేరుకు ముందు తగిలిస్తూనిర్ణయం తీసుకుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం.. ఆ పేరులోని కడప పేరును తొలగిస్తూ అధికారిక నిర్ణయాన్ని తీసుకుంది.

దీంతో.. వైఎస్సార్ కడప జిల్లా కాస్తా వైఎస్సార్ జిల్లాగా మారింది. దీనిపై ఆ జిల్లా వాసుల్లోనూ ఒకింత అయిష్టత ఉందని చెబుతారు. తాజాగా కూటమి సర్కారు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ జిల్లా పేరుకు కడప పేరును జోడిస్తూ నిర్ణయించింది. అదే సమయంలో వైఎస్సార్ పేరును యథాతధంగా ఉంచేయటం ద్వారా.. పాత పేరును పునరుద్ధరించినట్లుగా చెప్పాలి. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం కొందరికి మాత్రమే సంతోషానికి గురి చేయగా.. తాజాగా కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం అందరి మనసుల్ని దోచుకునేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం. పేర్ల విషయంలో ప్రభుత్వాలు సహజంగా చేసే తప్పుల్ని కూటమి సర్కారు అధిగమించిందన్న మాట వినిపిస్తోంది.