కేంద్ర ప్రభుత్వ అధికారి స్పీడుకు బ్రేకులు.. తమకేం తెలియదన్న హోంశాఖ
తిరుపతిలో వరుస సంఘటలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్షిస్తారంటూ కేంద్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ రాసిన లేఖ పెను దుమారం రేపింది.
By: Tupaki Desk | 19 Jan 2025 11:30 AM GMTతిరుపతిలో వరుస సంఘటలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్షిస్తారంటూ కేంద్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ రాసిన లేఖ పెను దుమారం రేపింది. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వచ్చిన విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ తిరుమల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర హోంశాఖకు అభ్యంతరం తెలపడంతో కేంద్ర అధికారి సమీక్ష నిలిచిపోయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. గతంలో చాలా సార్లు టీటీడీపై పెత్తనం చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపినా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరంతో కుదరలేదు. కానీ, ఇటీవల తిరుమలలో జరిగిన ఘటనలపై సమీక్షకు కేంద్ర అధికారి వస్తారంటూ విపత్తు నిర్వహణ డైరెక్టర్ నుంచి లేఖ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. టీటీడీపై కేంద్ర పెత్తనమేంటంటూ రాష్ట్ర ప్రభుత్వం సదరు అధికారి కోసం ఆరా తీయగా, కేంద్ర హోంశాఖకు ఆ లేఖతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో సదరు అధికారి ఓవరాక్షన్ వల్లే టీటీడీకి లేఖ రాశారంటూ కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చించింది. అత్యంత నాటకీయంగా సాగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపింది.
వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 13వ తేదీన తిరుమల ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటరులో షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభంవించింది. తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి న్యాయవిచారణకు ఆదేశించింది. అయితే ఈ సంఘటనపై తమకు ఫిర్యాదులు అందాయని కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. అంతేకాకుండా తమ సంస్థ అదనపు డైరెక్టర్ సమీక్షిస్తారంటూ ఆ లేఖ ద్వారా సమాచారమిచ్చారు. అయితే టీటీడీ కేంద్ర పరిధిలో లేకపోవడం, టీటీడీలో జరిగిన ప్రమాదాలపై సీబీఐ వంటి సంస్థలు విచారణ చేపట్టకపోవడంతో కేంద్రం జోక్యం చేసుకోలేకపోయింది. ఇదే సమయంలో ఏ కేంద్ర సంస్థ కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాయకూడదు. ఏదైనా, ఏమైనా సమాచారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాత్రమే లేఖ రాయాలి. కానీ, టీటీడీ వ్యవహారంలో అవేమీ జరగలేదు. కనీసం టీటీడీ ఈవోకు కూడా సమాచారమివ్వలేదు. మా అధికారి వస్తారు. సమీక్షిస్తారంటూ చైర్మన్ నాయుడికి లేఖ రావడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది.
హోంశాఖ నుంచి వచ్చిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబంధిత అధికారులతో చర్చించి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క అధికారి వచ్చి ఏం చూస్తారు? ఏం సమీక్షిస్తారంటూ నిలదీశారని సమాచారం. దీంతో అసలు విషయం బయటపడింది. తిరుమలలో సమీక్ష కోసం హోంశాఖ తరపున ఏ నిర్ణయం తీసుకోలేదని, విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సమీక్ష కూడా ఉండదని స్పష్టం చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ పంపారు. వాస్తవానికి విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మంచిన ఎన్డీఆర్ఎఫ్ భవనాల ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు. ఆయన వెంట వచ్చిన విపత్తు నిర్వహణ శాఖ అదనపు డైరెక్టర్ తిరుమలలో శ్రీవారి దర్శానానికి వెళ్లాలని భావించారని, తన పర్యటనకు అధికార ముద్ర వేసుకునేందుకు ‘క్రౌడ్ మేనేజ్మెంట్’పై సమీక్ష అంటూ లేఖ పంపారని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. అదనపు డైరెక్టర్ అత్యుత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరంతో సంజీవ్ కుమార్ జిందాల్ ప్రయత్నాలు బెడిసికొట్టాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.