Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ పై సిట్...అన్నీ తేల్చుడే!

దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ వైసీపీ డిమాండ్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:43 AM GMT
తిరుమల లడ్డూ పై సిట్...అన్నీ తేల్చుడే!
X

తిరుమలలోని లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో తయారు చేశారు అందులో జంతువుల కొవ్వుని కలిపారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా వివాదం రగులుతోంది

దానికి ఒక లాజికల్ ఎండ్ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో మొత్తం వ్యవహారాన్ని విచారించేందుకు సిట్ ని నియమిస్తున్నట్లుగా పేర్కొంది. సిట్ ద్వారా మొత్తం తిరుమలలో గత అయిదేళ్ళలో జరిగిన అపచారాలు అన్నీ కూడా వెలికి తీస్తామని చంద్రబాబు మీడియాకు చెప్పడంతో లడ్డూ ఇష్యూ ఇపుడు కొత్త మలుపు తీసుకుంది.

దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ వైసీపీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం సిట్ విచారణకు ఆదేశించింది. దీంతో విపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరుమలలో జరిగిన అపచారానికి విచారం వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. ప్రధానికి లేఖ రాయడమేంటి అని కూడా నిలదీశారు. అధర్మం, అన్యాయం అని ఆ లేఖలో పేర్కొనడమేంటని కూడా ప్రశ్నించారు.

చేసినంతా చేసి తిరిగి విమర్శలు చేస్తున్నారు అంటే మీరు మనుషులేనా అని పరుష పదజాలంతో బాబు ప్రశ్నించారు. శ్రీవారి మహా ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని అన్నారు. ఏకంగా ఐదేళ్లపాటు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారని ఆయన విమర్శించారు.

కోటానుకోట్ల భక్తుల మనోభావాలకు వాళ్లు విలువ నివ్వలేదు సరికదా ఆచారాలను పూర్తి స్థాయిలో మంటగలిపారు అని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో చోటు చేసుకున్న అపచారాలు చూసి కోట్ల మంది ప్రజల గుండెమండుతోందబి బాబు అన్నారు

అందుకే ఆగమ సలహాదారుల సూచన మేరకు తిరుమలలో శాంతి హోమం చేపడుతున్నామని అన్నారు.ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు శ్రీవారి ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ చేస్తారని చంద్రబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా గతంలో వైఎస్సార్ ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్నప్పుడు నాడు నేను పోరాడాను అని బాబు గుర్తు చేశారు. అలాంటిది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారని బాబు ఆరోపించారు.

అన్యమతస్తులను టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టారని అన్నారు. ఇవన్నీ తాను సీఎంగా కాదు భక్తుడిగా చెబుతున్నా అని బాబు అన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పిన ఆయన గత మూడు వందల ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయని అన్నారు

తిరుపతి ప్రసాదంలో నాణ్యత లేదు అనేది ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరూ చెప్పారని అన్నారు. రిజల్ట్ నెంబర్ 1లో ఎస్.వాల్యూ 86.62 ఉంది. కానీ ఉండాల్సింది 98.05 నుండి 101.95 అని బాబు అన్నారు. . దీనికి కారణం ఆలివ్, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫిష్ ఆయిల్ ఉండటం వల్ల అని ఆయన పేర్కొన్నారు.

అలాగే నెంబర్ 3 లో 22.43 ఎస్ వాల్యూ ఉంది, 95.90 నుండి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం పామాయిల్, బీఫ్ కొవ్వు ఉండడం అని చెప్పారు. ఇక నెంబర్ 4 లో ఎస్ వాల్యూ 117.42 ఉండాలి కానీ 97.96 నుండి 102.04 ఉంది. దీనికి కారణం పంది కొవ్వు ఉండటం అని బాబు విశ్లేషించారు. ఇవన్నీ చూశాక ఈవో నోటీసు ఇచ్చి నెయ్యి సప్లై చేసే డైరీని బ్లాక్ లిస్టులో పెట్టారని ఆయన అన్నారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు చెప్పేది ఏంటి అంటే జగన్ హయాంలో సరిగ్గా క్వాలిటీ టెస్టులు చేయించలేదని దాని ఫలితంగా శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని. దీని మీద సిట్ విచారణలఒ ఏమి తేలుతుందో చూడాల్సి ఉంది. అదే విధంగా వైసీపీ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద ఏ రకమైన తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది.