శాఖ పవన్ ది...సారీ లోకేష్ ది !
అదే సమయంలో లోకేష్ స్పందించడం కూడా చర్చకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ అలాగే మంత్రి ఆనం శాఖ విషయం ఇది అని అంటున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 7:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వంలో చిత్రమైన తీరు కనిపిస్తోంది అని అంటున్నారు. తిరుమలలో జనవరి లో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం భక్తులకు టోకెన్లు ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. దానికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. నిజానికి పవన్ శాఖ దేవాదాయం కాదు, ఆయన చూసే శాఖలు వేరు. అంతకు ముందు తిరుపతి లడ్డు లో కల్తీ చోటు చేసుకుంది అన్న వార్తల మీద ఆవేశపడిన పవన్ అప్పట్లో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆనాడూ ఆయన దేవాదాయ శాఖ చూడడంలేదని వామపక్ష నేతలు విమర్శించారు.
కట్ చేస్తే కడప జిల్లాలోని కాశీనాయన ఆశ్రమంలోని అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన ఘటన మీద మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధలన కారణంగా ఈ అన్నదాన సత్రాన్ని కూల్చివేసినట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కాస్తా పెను వివాదంగా మారింది. పీఠాధిపతులు దీని మీద భగ్గుమన్నారు.
అయితే అటవీ శాఖ పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. పైగా ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఈ విధంగా జరిగితే వెంటనే రియాక్టు కావలసింది పవన్ కళ్యాణే. కానీ లోకేష్ రియాక్టు అయ్యారు. సారీ చెప్పడమే కాకుండా తాను సొంత నిధులతో అక్కడ అన్నదాన సత్రాన్ని నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారు.
లోకేష్ ఈ విధంగా రియాక్టు కావడం మంచిదే పైగా ఆయన సొంత నిధులతో అన్న దాన సత్రాన్ని నిర్మిస్తామని చెప్పడమూ మంచిదే. కానీ ఒక మంత్రిగా ఆయన పరిధిలోకి రాని అంశం ఇదని అంటున్నారు. ఇక ఈ అంశం మీద అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అటవీ శాఖ పరిధిలో ఆశ్రమం ఉండడంతో అక్కడికి భక్తులు వెళ్ళాలన్నా నిబంధనలు అడ్డు వస్తున్నాయని అన్నారు.
ఆ ఆశ్రమ ప్రాంతాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెస్తామని అన్నారు. అక్కడ నిత్యాన్న దానం జరుగుతోందని రోజూ లక్ష మందికి పైగా భోజనాలు చేస్తారని మంత్రి తెలిపారు. ఆ సత్రాన్ని దేవాదాయ శాఖనే నిర్మిస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే పీఠాధిపతులు అంతా ఆగ్రహించిన ఈ ఘటన మీద పవన్ ఎందుకు స్పందించలేదు అన్నది చర్చనీయాంశంగా ఉంది. అదే సమయంలో లోకేష్ స్పందించడం కూడా చర్చకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ అలాగే మంత్రి ఆనం శాఖ విషయం ఇది అని అంటున్నారు.