వామ్మో... మద్యం దరఖాస్తుల ఆదాయం ఎంతంటే ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద పోటీయే జరిగింది.
By: Tupaki Desk | 12 Oct 2024 3:34 AM GMTఏపీలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద పోటీయే జరిగింది. ఫలితంగా విరగబడి మరీ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా మందు కిక్కు ఒక్క లెక్కన ఉందని అంటున్నారు. కేవలం లైన్సెన్స్ ఫీజు ఎక్సైజ్ డ్యూటీ కింద ప్రభుత్వం దరఖాస్తు తో పాటు కట్టాల్సిన మొత్తాన్ని నిర్దేశించింది.
రెండేళ్ల కాలానికి సంబంధించిన ఈ ఫీజుతో వచ్చిన దరఖాస్తులు వాటి వెనక మొత్తాన్ని చూస్తే కనుక ఏకంగా 1700 కోట్ల రూపాయలు ఏపీ ఖజానకు ఈ రూపంలో చేరినట్లుగా చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తు కు రెండు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఫీజుని విధించారు. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు గా ఉంటుంది.
దాంతో ఈ మొత్తం అంతా ప్రభుత్వానికి పెద్ద ఆదాయంగానే సమకూరిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే 65,629 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇందులో చివరి ఒక్కరోజే రికార్డుస్థాయిలో 7,920 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దీంతో ఏపీలో చూస్తే మందు మజా ఏ రేంజిలో ఉందో అర్థం అవుతోంది అని అంటున్నారు. ఇక ఈ నెల 14న డ్రా తీస్తారు. ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయని అంటున్నారు.
ఇక గతంతో పోలిస్తే ఇది పెద్ద మొత్తం అని గతానికి రెట్టింపు ఆదాయం అని కూడా అంటున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా చూస్తే కొన్ని కీలక నగరాలలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. అత్యధికంగా వచ్చినవిగా తీసుకుంటే విజయవాడలో చూస్తే 113 మందు షాపుల కోసం ఏకంగా 5704 దరఖాస్తులు వచ్చాయి అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు.
అలాగే రెండవ అత్యధికమైన దరకాస్తులు ఏలూరు నుంచి వచ్చాయి. ఇక్కడ 114 దుకాణాల కోసం 5178 దరకాస్తులు వచ్చాయి. ఇక మూడవ అత్యధిక దరకాస్తులుగా గుంటూరు జిల్లాలో 127 మందు దుకాణాలకు 4297 దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఈ మూడు ప్రాంతాలు ఏపీలోనే ఎక్కువ దరఖాస్తులు వచ్చినవిగా రికార్డుకు ఎక్కాయి.
వీటితో పాటుగా విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కూడా అత్యధిక దరఖాస్తుల వరసలో ఉన్నాయి. ఇక ఏజెన్సీలో చూస్తే అల్లూరి సీతారమరాజు జిల్లాలో 40 మందు దుకాణాల కోసం 1151 దరఖాస్తులు వచ్చయంటే ఇది కూడా భారీ స్పందనగానే చూస్తున్నారు.
ఇంత పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అంటే మందు వ్యాపారానికి మించినది లేదు అని అంటున్నారు. దీని మీదనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ గతంలో అయిదేళ్ల పాటు మద్యం వ్యాపారాన్ని వైసీపీ దోపిడీగా మార్చితే ఆ పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారని ఇపుడు టీడీపీ వైసీపీ కలసి సిండికేట్లు నడుతున్నారని ఆరోపించారు.
ఈ భారీ స్పందనను చూసిన జనాలు కూడా మందుకు ఉన్న డిమాండ్ ఏమిటి బాబోయ్ అని ఆశ్చర్యపోతున్నారు. మందు బిజినెస్ లో ఎంత ఎక్కువ పెట్టినా లాభాలే తప్ప నష్టాలు అన్న మాట ఉండదు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున పోటీ పడి మరీ దరఖాస్తు చేశారు అని అంటున్నారు. మరి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి షాపులు దక్కుతాయో ఎవరు మందు వ్యాపారులు అవుతారో మరి కొద్ది రోజులలో తేలనుంది.