Begin typing your search above and press return to search.

వైసీపీ లిక్కర్ కి ఒక్క ఆర్డినెన్స్ తో చెక్

ఏపీలో అయిదేళ్ల పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 12:30 AM GMT
వైసీపీ లిక్కర్ కి ఒక్క ఆర్డినెన్స్ తో చెక్
X

ఏపీలో అయిదేళ్ల పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేసింది. వాటి ద్వారానే అమ్మకాలు జరిపించింది. మధ్యం షాపులను వేలం వేయలేదు. అలా సిండికేట్ వ్యవస్థకు దెబ్బ కొట్టాలని చూసిందని అంటారు.

అయితే వైసీపీ జమానా ముగిసాక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలలు దగ్గర పడుతున్న వేళ కొత్త లిక్కర్ పాలసీని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు లోకి తేబోతోంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమలులోకి వస్తుంది.

ఇదిలా ఉండగా ఏపీలో మద్యం షాపుల సంగతేంటి అన్న చర్చ ఉండనే ఉంది. అయితే మద్యం షాపులను అన్నింటికీ రద్దు చేస్తూ ఒకే ఒక్క ఆర్డినెన్స్ తో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో వేలాదిగా ఉన్న లిక్కర్ షాపులకు మూత పడినట్లు అయింది.

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపుల ద్వారా భారీ ఎత్తున అవినీతి జరిగింది అని అధికార పక్షం ఇప్పటికే ఆరోపణలు గుప్పించింది. ఈ మద్యం షాపుల ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు సరిగ్గా చూపించకుండా నొక్కేశారు అని కూడా టీడీపీ జనసేన బీజేపీ ఆరోపిస్తూ వచ్చాయి.

వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులను సర్కారీ వారివి తీసేసి వాటి స్థానంలో కొత్తగ షాపులను ఏర్పాటు చేసుకోమని ప్రైవేటుకే అప్పగిస్తారు అని అంటున్నారు.

వైసీపీ అయిదేళ్ల పాలనకు ముందు ఏపీలో మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులే నిర్వహించేవారు. వారే సిండికేట్ గా ఏర్పడి మద్యం షాపులను తీసుకుని వేలం పాట ద్వారా ప్రభుత్వం నుంచి తెచ్చుకునే వారు. అలా ప్రైవేట్ చేతులలో ఉన్న దానిని వైసీపీ ప్రభుత్వం తన చేతులలోకి తీసుకుంది.

అపుడే దాని మీద ఆరోపణలు వినిపించాయి. ఇదేమి చోద్యమని కూడా అంతా ఆక్షేపించారు. వైసీపీ అయితే ప్రైవేట్ సిండికేట్ ద్వారా మద్యం విపరీతంగా పెరిగిపోతోంది అని చెప్పి దానిని రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మద్యం షాపులలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకుంది.

ఇక కరోనా సమయంలో ఏకంగా టీచర్లనే మద్యం షాపుల వద్ద కాపలాకు పెట్టడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర విమర్శలకు కారణం అయింది. ఇక కూటమి ప్రభుత్వం మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించరాదు అన్న నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతి ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల చేతనే వాటిని అమ్మించబోతోంది. అలాగే వేలం పాటలను నిర్వహించి వారికే అప్పగించబోతోంది.

దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా సర్కారే దగ్గర ఉండి మద్యం అమ్మిస్తోంది అన్న నిందలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ తీసుకుని వచ్చిన ప్రభుత్వమే మద్యం అమ్మే విధానం మాత్రం విమర్శల పాలు అయింది. అలాగే అవినీతి కూడా జరిగింది అన్న మాట కూడా ఉంది. కూటమి కొత్త పాలసీతో ముందుకు పోతోంది. దాంతో వైసీపీ మార్క్ లిక్కర్ కి చెక్ పడినట్లే అంటున్నారు.