నిన్న మంత్రులకు ర్యాంకులు.. రేపు సభ్యులకు అవార్డులు!
ఇందులో భాగంగా.. గత ఏడాది డిసెంబర్ వరకూ ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.
By: Tupaki Desk | 15 March 2025 7:00 PM ISTగత నెల మొదటివారంలో జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంత్రుల పనితీరుపై ర్యాంకులను ప్రకటించారు చంద్రబాబు. ఇందులో భాగంగా.. గత ఏడాది డిసెంబర్ వరకూ ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆ సందర్భంగా తాను 6వ స్థానంలో ఉన్నట్లు చెప్పిన చంద్రబాబు.. మంత్రి ఫరూఖ్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ 8 స్థానంలో, పవన్ కల్యాణ్ 10వ స్థానంలో నిలిచారు. ఇలా కూటమిలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చి చంద్రబాబు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు! ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తమ లెజిస్లేటర్ అవార్డులు తేబొత్తున్నట్లు తెలుస్తోంది.
అవును... ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్లే.. రాష్ట్రంలోనూ ప్రతీ ఏటా ఉత్తమ లెజిస్లేటర్ ను ఎంపిక చేసి అవార్డును ఇచ్చేందుకు ప్రాథమికంగా అడుగులు పడ్డట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి వచ్చే బడ్జెట్ సమావేశాల వరకూ సభ్యుల పనితీరుపై ఉత్తమ లెజిస్లేటర్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లి చింతకాయల అయ్యన్నపాత్రుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తమ లెజిస్లేటర్ ఎంపిక కోసం అసెంబ్లీలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రాథమికంగా అనుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా... సభా మర్యాదలను పాటిస్తూ, సభా గౌరవాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారా? సభ్యులు అడుగుతున్న ప్రశ్నల తీరుతో పాటు చర్చల్లో ఏ మేరకు భాగస్వాములవుతున్నారు? సభలో ప్రవర్తన, వాడుతున్న భాష, సహచర సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు.. సమావేశాల హాజరు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారని అంటున్నారు.
ఈ విధంగా పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ పరిశీలించి, విశ్లేషించి ఉత్తమ లెజిస్లేటర్ ను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. అయితే.. దీనికోసం ఏటా ఒక్కరిని మాత్రమే ఎంపిక చేస్తారా.. లేక, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్లా కనీసం ముగ్గురుని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది!