ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ పర్వం.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయ్?
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
By: Tupaki Desk | 28 Feb 2025 8:53 AM ISTఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ దూరంగా ఉంది. ఇక, కూటమి సర్కారు మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 9 మాసాల కూటమి పాలనకు విద్యావంతులు ఇచ్చిన రెఫరెండంగానే ఈ ఎన్నికలను భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ ఎన్నికలను మించిన విధంగానే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నాయకులు బరిలో ఉండడం.. వైసీపీ పోరులో నిలబడక పోవడంతో ఈ ఎన్నికల్లో విజయం తధ్యమని కూటమి నాయకులు లెక్కలు వేసుకున్నారు.
ఇక సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించారు. వాస్తవ సమయం 4 గంట లకే ముగిసినా.. మరో గంట వరకు అవకాశం కల్పించారు. ఇక, పోలింగ్ శాతాన్ని గమనిస్తే.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు స్థానాల పరిధిలో 66 శాతం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపరిధిలో 59 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 92 శాతం పోలింగ్ నమోదైంది.
తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను గమనిస్తే..(వీటిని మీడియా సంస్థలు చేయలేదు. కేవలం కూటమిపార్టీలు చేయించుకున్న అంతర్గత సర్వే ప్రకారం) ఉత్తరాంధ్రలో కూటమి మద్దతు ప్రకటించిన పాకాలపాటి రఘువర్మ విజయం తధ్యమని తెలుస్తోంది. అదేసమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. స్వతంత్రులు ఎక్కువగా ఉండడం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు బరిలో నిలబడడంతో ఇక్కడ గెలుపుపై అంచనా బొటాబొటిగా ఉన్నాయి. ఇక, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం కూటమి తరఫున బరిలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాగా. వాస్తవ ఫలితం కోసం మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాలి.