Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్' ప్రీమియర్ షో... రాకెట్ ప్రయోగాలతో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

దీనిపై స్పందించిన హైకోర్టు... గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాల టిక్కెట్ విషయంలో పెంచిన ధరలను 14 రోజులు కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 10:15 AM GMT
గేమ్  ఛేంజర్  ప్రీమియర్  షో... రాకెట్  ప్రయోగాలతో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
X

'గేమ్ ఛేంజర్', 'డాకు మహరాజ్' సినిమాలకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన, టిక్కెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన వ్యక్తి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇందులో భాగంగా... టిక్కెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని.. ఆ సినిమాల్లోని హీరోలు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బంధువులు కావడంతోనే ధరల పెంపునకు అనుమతి ఇచ్చారని అన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలిపారు.

దీనిపై స్పందించిన హైకోర్టు... గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాల టిక్కెట్ విషయంలో పెంచిన ధరలను 14 రోజులు కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి వేళల్లో సినిమాల ప్రీమియర్ షో ల ప్రదర్శనను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడంపై ధర్మాసనం ఆసక్తికరంగా స్పందించింది.

అవును... గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని.. అందువల్ల అర్ధరాత్రి వేళల్లో ప్రీమియర్ షోల ప్రదర్శన ఆపెయ్యాలని న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. "శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణించారనే కారణంతో శ్రీహరికోటలో ప్రయోగాలు నిలిపివేయాలన్నట్లు ఉంది మీ అభ్యర్థన" అని వ్యాఖ్యానించింది!

గేమ్ ఛేంజర్ కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!:

మరోపక్క.. గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా... విడుదల రోజు మల్టీప్లెక్సుల్లో అదనంగా రూ.150.. సింగిల్ స్క్రీన్ లో అదనంగా రూ.100 టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో.. సినిమా విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల షోలకు అనుమతి ఇచ్చింది!

కాగా.. 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం.. ఆమె కుమారుడు నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం... బెనిఫిట్ షో లకూ అనుమతి ఇచ్చేది లేదని.. టిక్కెట్ ధరల పెంపు కూడా ఉండదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అదనపు షోలకు, టిక్కెట్ ధరల పెంపుకు రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది!