అధికారులు - మంత్రులు - ప్రభుత్వం.. ఈ చర్చ ఆగేదెప్పుడు..!
అధికారులు తమ మాట వినడం లేదని.. వారికి నచ్చినట్టుగానే పనులు చేస్తున్నారన్నది మంత్రులు సైతం చెబుతున్న మాట
By: Tupaki Desk | 21 Nov 2024 9:30 PM GMTఏపీలో ఉన్నతాధికారుల చుట్టూ గత రెండు మాసాలుగా చర్చ సాగుతూనే ఉంది. అధికారులు తమ మాట వినడం లేదని.. వారికి నచ్చినట్టుగానే పనులు చేస్తున్నారన్నది మంత్రులు సైతం చెబుతున్న మాట. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక, ఇతర మంత్రులు కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సభలోనే ఈ విషయం చర్చకు వచ్చింది.
అసెంబ్లీలో కూడా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ.. పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. తమకు అందుబాటులో ఉండడం లేదని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. మరికొందరు అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెప్పారు. సభలోనే సంబంధిత అధికారులు ఉండడం లేదన్నారు. ఈ విషయంపై స్పీకర్ అయ్యన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. అధికారులను నమ్మొద్దని సూచించారు.
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తాను చెప్పింది ఒక టైతే.. వారు చేస్తున్నది మరొకటిగా ఉందని స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిసింది. మొత్తం గా చూస్తే.. అధికారుల వ్యవహారం కూటమిసర్కారును కుదిపేస్తోంది. తాము చెప్పింది వినడం లేదన్నది అధికార పార్టీ నాయకులు, మంత్రులు చెబుతున్న మాట. అయితే.. ఇలా ఎందుకు చెబుతున్నారన్నది ఒక ప్రశ్న అయితే.. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు అవుతున్నా.. ఇప్పటికీ పట్టు సాధించలేక పోయారా? అనేది కూటమివైపు వస్తున్న విమర్శలు.
కానీ, ఇక్కడే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1) అధికారులు చెబుతున్న మాట ఏంటంటే.. తాము నిబంధనల ప్రకారం ముందుకు సాగుతున్నామని. గతంలో అయినా.. ఇప్పుడైనా తాము నిబంధనల మేరకు పనిచేశామని ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. 2) అధికార పార్టీ నాయకుల విషయానికి వస్తే.. తాము కోరుకుంటున్నట్టుగా అధికారులు నివేదికలు ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన. సహజంగా నాయకులు కోరుకుంటున్నట్టుగా పనిచేయాలని ఆశిస్తారు. కానీ, ఇప్పుడు అదే జరగడం లేదు. దీంతో ఈ చర్చ, రచ్చ మరికొన్నాళ్ల వరకు సాగుతుందనేది పరిశీలకులు చెబుతున్న మాట.