Begin typing your search above and press return to search.

ఏపీ బ‌డ్జెట్‌పై సంకేతాలు.. వాటికి నిధులు పుష్క‌లం.. !

మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 11:30 PM GMT
ఏపీ బ‌డ్జెట్‌పై సంకేతాలు.. వాటికి నిధులు పుష్క‌లం.. !
X

మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. అయితే.. ఈ బ‌డ్జెట్‌లో ఏముంటాయి? ఏయే అంశాల‌ను ప్ర‌స్తావిస్తారు? నిధుల సంగ‌తేంటి? అనే అంశాలు గ‌త వారం ప‌దిరోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఎందుకంటే.. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో రా ష్ట్రం అల్లాడుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల కూడా వ్యాఖ్యానించారు. ధ్వంస‌మైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని అన్నారు.

అదేవిధంగా జ‌గ‌న్ హ‌యాంలో చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని.. ఇటీవ‌లే 206 కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డీ రూపంలో చెల్లించామ‌ని మంత్రి నారా లోకేష్ కూడా చెప్పుకొచ్చారు. అంటే.. ఒక‌ర‌కంగా.. రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి ఇంకా మెరుగు ప‌డ‌లేద‌న్న సంకేతాల‌ను ఇచ్చారు. దీంతో బ‌డ్జెట్‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధుల కేటాయింపు వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అస‌లు ఏయే ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నార‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ అబ్డుల్ న‌జీర్‌.. తాజాగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం ఈ చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల అమ‌లుపై.. కూట‌మిస‌ర్కారు వ్యూహాన్ని స్ప‌ష్టం చేసింది. కీల‌క‌మైన ప‌థ‌కం.. పైగా రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఎదురు చూస్తున్న మాతృవంద‌నం ప‌థ‌కాన్ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తావించారు. అంటే.. ఈ ప‌థ‌కానికి బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌నున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే.. ఎంత‌మందికి ఇస్తారు? ఏంటి క‌థ అనేది బ‌డ్జెట్‌లోనే తెలియ‌నుంది.

ఇక‌, మ‌రోవైపు.. రైతుల‌కు సంతృప్తిక‌ర‌మైన విధానాలు తీసుకువ‌స్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. రైతుల‌కు మేలు చేసే దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌న్నారు. దీనిని బ‌ట్టి అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు రూ.20 వేల చొప్పున పెట్టుబ‌డి సాయం అంద‌నుంది. దీనిలో కేంద్రం రూ.6000 ఇవ్వ‌గా.. రాష్ట్ర‌ప్ర‌భుత్వం 13 వేలు ఇవ్వ‌నుంది. దీనికి కూడా నిధులు కేటాయించ‌నున్నారు. అదేవిధంగా నైపుణ్య వృద్ధికి పెద్ద‌పీట వేయ‌నున్నారు. త‌ద్వారా.. బ‌డ్జెట్‌లో రెండు కీల‌క‌మైన సూప‌ర్ సిక్స్‌కు నిధులు కేటాయించ‌నున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి.