Begin typing your search above and press return to search.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కు ముప్పు..?

By:  Tupaki Desk   |   27 March 2025 9:30 AM
ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కు ముప్పు..?
X

ఏపీ లిక్కర్ స్కాంపై పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి అని ప్రచారం జరుగుతుంది . లిక్కర్ స్కాంలో రూ.4 వేల కోట్లను దేశం దాటించారని ఎంపీ లావు పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో జరిగిన లిక్కర్ స్కాంలు అన్నింటిని తలదన్నేలా ఏపీలో భారీ కుంభకోణం జరిగిందని ఎంపీ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ స్కాంతో సంబంధం ఉన్నవారితో ఎంపీ లావుకు ముప్పు పొంచివుందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.

లిక్కర్ స్కాంలో వైసీపీలోని కొందరు నాయకులకు సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి లిక్కర్ స్కాంను బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది. వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని, ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల పాత్ర ఉందని, తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పార్లమెంటులో ప్రస్తావించడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లిక్కర్ స్కాంపై కూపీ లాగుతోంది. దీంతో ఏ క్షణమైనా అరెస్టులు జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కాంపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఏకంగా పార్లమెంటులోనే లిక్కర్ స్కాం ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది. దీంతో లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న నేతలు వారి అనుచరులను రెచ్చగొట్టి ఎంపీ లావుపై దాడికి ఉసిగొల్పే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఎంపీకి ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను రెట్టింపు చేయాలని సూచించారు. అయతే ఇంటెలిజెన్స్ సూచనలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సివుందని సమాచారం.