Begin typing your search above and press return to search.

ప్రైవేటు మ‌ద్యానికి 'అధికారిక' తూట్లు.. !

కానీ, అస‌లు స‌మ‌స్య‌.. ఇంకా తొలిగిపోలేదు. ప‌దే ప‌దే చంద్ర‌బాబు చెబుతున్నా.. తమ్ముళ్లు ఏమాత్రం వినిపించుకోవ‌డం లేదు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:39 AM GMT
ప్రైవేటు మ‌ద్యానికి అధికారిక తూట్లు.. !
X

రాష్ట్రంలో మ‌ద్యం వ్యాపారాన్ని ప్ర‌భుత్వ ప‌రిధి నుంచి త‌ప్పించిన కూట‌మి స‌ర్కారు.. త‌ద్వారా త‌మ‌కు రిలీఫ్ ద‌క్కింద‌ని భావించింది. అంతేకాదు.. స‌ర్కారు మ‌ద్యం వ్యాపారం చేయ‌డాన్ని గ‌తంలో త‌ప్పుబ‌ట్టిన సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు తీసుకున్న‌నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నారు. అప్లికేష‌న్ల ద్వారా 2 వేల కోట్లు, వ్యాపారం ద్వారా 3 వేల కోట్లు ప్ర‌స్తతం చేతికి అంద‌డంతో ప్ర‌భుత్వ ప‌నులు కూడా స‌జావుగా సాగేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇంత వ‌రకు బాగానే ఉంది.

కానీ, అస‌లు స‌మ‌స్య‌.. ఇంకా తొలిగిపోలేదు. ప‌దే ప‌దే చంద్ర‌బాబు చెబుతున్నా.. తమ్ముళ్లు ఏమాత్రం వినిపించుకోవ‌డం లేదు. త‌మ‌కు వాటాలు కావాల్సిందేన‌ని అధికారికంగానే హుకుం జారీ చేస్తున్నారు. సొంత నేత‌లపైనా వారు పెత్త‌నం చేస్తున్నారు. ``అవును తమ్ముడు.. నువ్వు వ్యాపారం చేసుకో. సంపాయించుకో. ఎవ‌రు వ‌ద్ద‌న్నారు. మాది మాకు ఇవ్వ‌మ‌నే క‌దా అడుగుతున్నాం. నీ వ్యాపారానికి అడ్డొచ్చామా? చెప్పు.`` అని చాలా లౌక్యంగా వాటాల‌ను గుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పోనీ.. ఇదేమ‌న్నా 5 రూపాయాలు, ప‌ది రూపాయ‌లుగా ఉంటే.. వ్యాపారాలు చేసుకునేవారు ఇచ్చేందుకు రెడీగానే ఉన్నారు. కానీ, 30 శాతం వాటాలు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇస్తే స‌రే.. లేక‌పోతే నీఇష్టం అని మొహం మీదే చెబుతున్నారు. సీమ‌లోని క‌ర్నూలు, అనంతపురం ఈ జాబితాలో ముందున్నాయి. ఇక‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ త‌మ్ముళ్లు ఎక్క‌డా ఆగ‌డం లేదు. పైగా.. వాటాలు ఇవ్వ‌లేక పోతే.. లైసెన్సులు ఇచ్చేయాల‌ని.. ఫీజు ఇస్తామని కూడా ఆఫ‌ర్లు ఇస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా విజ‌య‌వాడ‌లో అయితే.. కీల‌క‌మైన గాంధీన‌గ‌ర్‌(సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం)లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క షాపు తెర‌వ‌లేదు. ఈ ఏరియాలో మొత్తం 18 షాపుల‌కు ప్ర‌భుత్వం లైసెన్సు ఇచ్చింది. ఇది జ‌రిగి.. ఐదు రోజులు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క దుకాణానికి కూడా కొబ్బ‌రికాయ కొట్ట‌లేదంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక‌, గుంటూరులోని ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గంలో(తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే) 22 షాపుల‌కు లైసెన్సులు తెచ్చుకుంటే.. కేవ‌లం మూడు మాత్ర‌మే ప్రారంభ‌మ‌య్యాయి. దీనిని బ‌ట్టి.. అధికార నేత‌ల ఒత్తిళ్లు.. ప్రైవేటు మ‌ద్యంపై ఎలా ఉన్నాయ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.