స్థానిక సంస్థలలో అవిశ్వాస పర్వానికి తెర లేచినట్లే !
ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య కాలమంతా కార్పోరేషన్ల నుంచి మొదలుపెడితే పంచాయతీల వరకూ ఫిరాయింపులు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 21 Nov 2024 3:55 AM GMTస్థానిక సంస్థలు ఏపీలో మెజారిటీ వైసీపీ చేతిలో ఉన్నాయి. అనేక కార్పోరేషన్లు, వందకు పైగా మునిసిపాలిటీలు ఉంటే అందులో నూటికి ఎనభై శాతం పైగా వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి. ఇక మండలాలు జిల్లా పరిషత్తులు పంచాయతీలు కూడా నూటికి తొంబై శాతం వైసీపీ పరం అయ్యాయి. 2021లో జరిగిన ఈ ఎన్నికలకు గడువు 2026 వరకూ ఉంది. అంటే మరో ఏణ్ణర్ధంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగాల్సి ఉంది అన్న మాట.
ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య కాలమంతా కార్పోరేషన్ల నుంచి మొదలుపెడితే పంచాయతీల వరకూ ఫిరాయింపులు జరుగుతున్నాయి. అలా చాలా చోట్ల జరిగాయి. ఇక విశాఖ వంటి కార్పోరేషనల్లో కూటమి బలం బాగా పెరిగి మెజారిటీ స్కోర్ ని దాటేసింది.
ఇంత జరిగినా మేయర్ కానీ మునిసిపాలిటీలలో చైర్ పర్సన్లు కానీ జెడ్పీ చైర్ పెర్సన్స్ ఎంపీలు కానీ కూటమి ఖాతాలో పెద్దగా పడడం లేదు. దానికి కారణం అవిశ్వాసం ప్రవేశ పెట్టాల్సి ఉంది. అలా పెట్టి వైసీపీని దించితేనే అధికారికంగా కూటమి నేతలకు ఆ సీటు దక్కుతుంది.
కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలీ అంటే నాలుగేళ్ళ పాటు వేచి ఉండాలి. అంటే 2025 మార్చి ఏప్రిల్ వరకూ ఆ ఊసే తలవకూడదు, అప్పటిదాకా అంటే మరో ఆరు నెలల సమయం అన్న మాట. ఇక ఆ మీదట ఎటూ ఏడాదిలో ఎన్నికలే స్థానిక సంస్థలకు వచ్చేస్తాయి. అందువల్ల అలా చేసినా పదవులు అందుకున్న వారిలో ఉత్సహం ఉండదు, అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అవిశ్వాస తీర్మానం స్థానిక సంస్థలలో పెట్టడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ విధించిన గడువుని నాలుగేళ్ళ నుంచి రెండేళ్ళకు కుదించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే అది ఎట్టకేలకు సాకారం అయింది అని అంటున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. దాంతో దీనిని అసెంబ్లీలో పెట్టి ఆమోదముద్ర వేయించుకుంటే ఏపీలో దాదాపుగా అత్యధిక స్థానిక సంస్థలు కూటమి ఖాతాలోకి వెళ్ళడం ఖాయమని అంటున్నారు. అధికార పార్టీలోకి వెళ్ళి మరింత దర్జాగా పదవులు అనుభవించాలని అనుకునేవారికి ఇది రాజమార్గంగా ఉంటుందని అంటున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల ఫిరాయింపులకు బాహాటంగా తెర లేచినట్లే అని అంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖలో ఈ మేరకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. దాంతో చాలా చోట్ల వైసీపీ నుంచి కూటమి వైపు దూకుళ్ళు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.