ఆంధ్రప్రదేశ్ లో 'ఆరోగ్యశ్రీ సేవలు బంద్' పై తీవ్ర ఉత్కంఠ!
అవును.. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)లో ఉచిత ఓపీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు (ఈ.హెచ్.ఎస్.) నిలిచిపోనున్నాయి!
By: Tupaki Desk | 6 Jan 2025 3:07 PM GMTఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)ను సంబంధిత నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోనున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఏపీ నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలిపారు.
అవును.. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)లో ఉచిత ఓపీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు (ఈ.హెచ్.ఎస్.) నిలిచిపోనున్నాయి! ఈ విషయాలపై స్పందించిన విజయ్ కుమార్... ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు నెలకు రూ.300 కోట్ల వరకూ బిల్లులు అవుతున్నాయి.. అయితే.. రూ.3,000 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని అన్నారు.
గత ఏడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని.. దీంతో సెప్టెంబర్ లో చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉచిత వైద్య సేవలు అందజేయలేమని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో.. మందులు, వైద్య పరికరాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారని తెలిపారు.
దీనికి తోడు ఓవర్ డ్రాఫ్ట్ కావడంతో బ్యాంకులు సైతం సహకరించడం లేదని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే జనవరి 6 నుంచి ఈ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని విజయ్ కుమార్ వెల్లడించారు. దీంతో.. ట్రస్ట్ సీఈవో ఫోన్ చేసి బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారని.. మంగళవారం చర్చలకు ఆహ్వానించారని తెలిపారు.
అయితే... ప్రభుత్వంపై గౌరవంతో సోమవారం ఉదయం నుంచి ఓపీ, ఈ.హెచ్.ఎస్. సేవలు మాత్రమే నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ తరుణంలో మంగళవారం నాడు ప్రభుత్వంతో చర్చలు సఫలం కానిపక్షంలో ఈ నెల 26 నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు!
మరి.. రేపు (7 జనవరి) స్పెషల్ సీఎస్ తో అసోసియేషన్ భేటీ కానున్న నేపథ్యంలో.. ఈ భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో... ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం అనేది ప్రభుత్వానికి ఇబ్బందే అనే మాటలు వినిపిస్తున్నాయి.