Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీ విజయవాడకు రావాలి : ఏపీ మంత్రి

విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం&ట్రావెల్ సమ్మిట్-2024 లో మంత్రి కందుల దుర్గేశ్‌, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:39 PM GMT
సినీ ఇండస్ట్రీ విజయవాడకు రావాలి : ఏపీ మంత్రి
X

తెలుగు చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ సినీ ప్రముఖులు ఇరు రాష్ట్రాలతోనూ సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ విజయవాడకు తరలి వస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం&ట్రావెల్ సమ్మిట్-2024 లో మంత్రి కందుల దుర్గేశ్‌, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గేశ్‌ మాట్లాడుతూ సస్తైనబుల్ టూరిజం(సుస్థిర పర్యాటకం) మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. సినిమాల షూటింగ్స్ జరిగితే రెవెన్యూ పెరుగుతుందని.. తెలంగాణతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలోనే సినిమాల చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచాలని వస్తున్నారు. తెలుగు సినిమాలకు సహకారం అందిస్తాం. అంతకంటే ముందు సినీ ఇండస్ట్రీ విజయవాడకు షిఫ్ట్ అయితే మరింత యూస్ ఫుల్ గా ఉంటుందని కందుల దుర్గేశ్ అన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, అందుకే పీపీపీ విధానంపై దృష్టిపెడుతున్నామని తెలిపారు. సలహాలు తీసుకొని అందరికీ అనుకూలంగా ఉండేలా త్వరలో టూరిజం పాలసీ తీసుకొస్తామని మంత్రి చెప్పారు.

స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రాష్ట్రానికి త్వరలో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడానికి కేంద్రం హామీ ఇచ్చిందని కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్న బ్లూ ఫాగ్ బీచ్ ఒక్కటే ఉందని, మిగిలిన బీచ్‌లను కూడా అభివృద్ధి చేయడంపై దృష్టి పెడతాం అని చెప్పారు. రాష్ట్రంలో షూటింగ్ చేస్తున్న ప్రాంతాల అసలైన పేర్లను సినిమాలో ప్రస్తావించాలని, అప్పుడే ఈ ప్రాంతాల గురించి అందరికీ తెలుస్తుందని అభిప్రాయ పడ్డారు. ఏపీలోని పర్యటక ప్రాంతాలపై అందరూ కలసి ప్రచారం చేయాలని మంత్రి కోరారు.

టాలీవుడ్ ను షిఫ్ట్ చేయాలనే విషయం మీద గత ప్రభుత్వంలోనూ చర్చలు జరిగాయి. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి సహా పలువులు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా వాళ్లకు ఇళ్ల స్థలాలతో పాటుగా స్టూడియోల నిర్మాణం కోసం భూములు ఇస్తామని మాజీ సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని, నెమ్మదిగా సినీ ఇండస్ట్రీని వైజాగ్ కి షిఫ్ట్ చేసే ఆలోచన చేయాలని కోరారు. ఏపీలో షూటింగ్స్ జరిగేలా చూడాలని, వైజాగ్ ను జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతంగా క్రియేట్‌ చేద్దామని అన్నారు.

ఇప్పుడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడకు వస్తే ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా టూరిజానికి సంబంధించి షూటింగ్స్ కు చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, శుభ్రత విధానాల్లో ఆహారం తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇండియాలో ఫ్రెండ్లీ టూరిజం లేదని, పర్యాటకులు వెళ్తే సులభంగా విహరించే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు.