Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ టీడీపీ...విద్యుత్ షాక్ ఎవరికి ?

అయితే దీనికి కౌంటర్ గా టీడీపీ కూటమి నుంచి వైసీపీని విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:37 AM GMT
వైసీపీ వర్సెస్ టీడీపీ...విద్యుత్ షాక్ ఎవరికి ?
X

వైసీపీ విద్యుత్ పోరాటానికి సిద్ధమైపోయింది. ఏపీలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మీద ఏకంగా 15 వేల 500 కోట్ల దాకా ట్రూఅప్ చార్జీల పేరుతో వడ్డించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ చార్జీల సర్దుబాటు ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకూ ఏడాది పాటు ప్రతీ విద్యుత్ బిల్లు మీద అదనంగా పడుతుందని అంటోంది. యూనిట్ మీద రూపాయిన్నర అదనపు భారంగా వేశారు అని విమర్శిస్తోంది.

ఎన్నికల్లో చెప్పినది ఏంటి ఇపుడు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నిస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచం సరికదా ఉన్న వాటిని తగ్గిస్తామని చెప్పిన ప్రభువం ఇపుడు ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి పెను భారం ఏ విధంగా వేస్తుంది అని వైసీపీ నిలదీస్తోంది. దాంతో విద్యుత్ పోరాటం పేరుతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు శుక్రవారం చేస్తోంది.

అయితే దీనికి కౌంటర్ గా టీడీపీ కూటమి నుంచి వైసీపీని విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే పెరిగిన విద్యుత్ చార్జీలు జగన్ పుణ్యమే అని అన్నారు. ఆయన విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేయడంతోనే ఇపుడు ఈ రకమైన దుస్థితి వచ్చిందని గాడిలో పెట్టే క్రమంలోనే ఇదంతా అని సమర్ధించుకుంటూ వైసీపీ ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కాదు జగన్ ఇంటి ముందు ధర్నాలు చేయాలని కూడా గొట్టిపాటి వైసీపీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీగా విద్యుత్ చార్జీల పెంపు వ్యవహారం సాగుతోంది. అయితే సామాన్యులు దీని మీద ఏమని అనుకుంటున్నారు అన్నది ముఖ్యం. జగన్ పేరు చెప్పి ఎంతసేపూ ఆయనను ఆయన పాలనను విమర్శిస్తూ నేరం నాది కాదు జగన్ ది అంటే జనం అంగీకరిస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అదే టైం లో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బాదుడుని తగ్గిస్తామని చెప్పినది కూడా టీడీపీ పెద్దలే కదా అని కూడా అంటున్నారు.

ఇపుడు చార్జీలు పెంచేసి జగన్ దే పాపం అంటే జనాలు అంత ఈజీగా కన్వీన్స్ అవుతారా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ తమ హయాంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయన్నది మరచి ఇపుడు టీడీపీ మీద నిరసనలకు దిగితే జనాలు ఎంత మేరకు విశ్వసిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు

ఈ విధంగా అటు అధికార ఇటు విపక్ష పార్టీలు రెండూ విద్యుత్ అంశంతో జనంలోకి పోతున్నాయి. మరి జనాలు ఎవరి వాదన రైట్ ఎవరిది రాంగ్ అని ఆలోచించుకుంటారు అని అంటున్నారు. విద్యుత్ అయితే ముట్టుకుంటే షాకే. మరి ఆ షాక్ ఏదో ఒక పార్టీకి అయితే తగులుతుంది. అది ఏ పార్టీకి అన్నది వైసీపీ ధర్నాకు వచ్చే స్పందనను బట్టే చూడాల్సి ఉంది అంటున్నారు.