Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు దూకుడుకు ఇలా బ్రేక్ ప‌డిందేంటి!

ఇక‌, అధికారుల‌తోనూ జిల్లాల స‌మీక్ష‌లు చేస్తున్నారు. ప‌లు కొత్త కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. వ‌డివ‌డిగా సాగుతున్న చంద్ర‌బాబు దూకుడుకు ఇప్పుడు చిన్న‌పాటి బ్రేక్ ప‌డింది.

By:  Tupaki Desk   |   30 Jan 2025 4:37 AM GMT
చంద్ర‌బాబు దూకుడుకు ఇలా బ్రేక్ ప‌డిందేంటి!
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడు మాసాలు అయింది. ప్ర‌తి రోజూ.. చాలా ఇంపార్టెంట్‌గా సీఎం చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నారు. నిమిషం స‌మ‌యాన్ని కూడా వృథా చేయ‌కుండా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. స‌మీక్ష‌లు, సంప్ర‌దింపులు, నిర్ణ‌యాలు, ప‌ర్య‌ట‌న‌లు, అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం.. ప‌నులు చేయించ‌డం ఇలా.. చంద్ర‌బాబు పాల‌నా కాలంలో ప్ర‌భుత్వం ప‌రుగులు పెడుతోంది. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. జిల్లాల్లో త‌మ్ముళ్ల ప‌నితీరును కూడా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నారు.

ఇక‌, అధికారుల‌తోనూ జిల్లాల స‌మీక్ష‌లు చేస్తున్నారు. ప‌లు కొత్త కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. వ‌డివ‌డిగా సాగుతున్న చంద్ర‌బాబు దూకుడుకు ఇప్పుడు చిన్న‌పాటి బ్రేక్ ప‌డింది. తాజాగా వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్‌తో దాదాపు ఏపీలోని స‌గం జిల్లాలు ప్ర‌భావితం అవుతున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మాన్నీ చేప‌ట్ట‌డానికి వీలు లేకుండా పోయింది.

ఇక‌, గుంటూరు-కృష్నా జిల్లాలు, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోనూ కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి అధికారిక కార్యక్ర‌మం కూడా చేప‌ట్టేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. నిజానికి వ‌చ్చే నెల‌లో ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. వీటికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే షెడ్యూల్ రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను వాయిదా వేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేషన్ ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల కానుంది. 10వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లు తీసుకుంటారు. మ‌రో రెండు రోజులు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 27న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అది పూర్త‌యి.. ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు కూడా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు దూకుడుకు తాత్కాలికబ్రేక్ ప‌డిన‌ట్టేన‌ని తెలుస్తోంది.