Begin typing your search above and press return to search.

నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తుల లెక్కలు ఇవే!

ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేన అభ్యర్థి నాగబాబు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 March 2025 10:31 AM IST
నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తుల లెక్కలు ఇవే!
X

ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేన అభ్యర్థి నాగబాబు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావటం తెలిసిందే. సోమవారం.. మిగిలిన నలుగురు అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ ఖాళీలకు ఒకటి జనసేనకు.. మరొకటి బీజేపీకి.. మిగిలిన మూడు టీడీపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తమ ముగ్గురు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ఆదివారమే ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు వచ్చారు సోము వీర్రాజు.

ఈ నలుగురు సోమవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించిన అఫిడవిట్లలో వీరికి ఉన్న ఆస్తులు.. అప్పుల లెక్కల్ని వెల్లడించారు. ఈ నలుగురిలో అతి తక్కువ ఆస్తులు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అయితే.. ఎక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా టీడీపీ నేత బీద రవిచంద్రగా తేలింది. ఇంతకూ ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి? స్థిరాస్తులు ఎన్ని? చరాస్తులు ఎన్ని? అప్పులు ఎన్ని? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

నలుగురు అభ్యర్థుల్లో భారీ ఆస్తులున్న అభ్యర్థిగా టీడీపీకి చెందిన బీద రవిచంద్ర నిలిచారు. ఆయన కుటుంబానికి స్థిర చరాస్తులు కలిపి రూ.41.09 కోట్లుగా వెల్లడించారు. అప్పులు రూ.10.83 కోట్లుగా తేల్చారు. ఆయన పేరు మీద ఒక్క వెహికిల్ లేదు. కానీ.. భార్య.. కుమార్తె పేర్ల మీద రూ.17.67 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. రవిచంద్రకు ఒక్క గ్రాము బంగారం లేదు. కానీ.. భార్య పేరు మీద రూ.37 లక్షలు.. కుమార్తె పేరు మీద రూ.5 లక్షల ఆభరణాలు ఉన్నట్లుగా తేల్చారు.

బ్యాంకుల్లో రూ.69 లక్షలు.. మ్యూచ్ వల్ ఫండ్స్.. బాండ్లు.. డిబెంచర్లు.. షేర్ల రూపంలో రూ.15.09 కోట్లు.. ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.6.73 కోట్లు.. పాలసీలు రూ.35.43 లక్షలు.. తనకు.. తన భార్య.. కుమార్తె పేరు మీద చరాస్తులు రూ.23.46 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తన పేరు మీద రూ.2.31 కోట్లు.. భార్య పేరు మీద రూ66.28 లక్షల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక వ్యవసాయేతర భూముల విషయానికి వస్తే రవిచంద్ర పేరుతో రూ.7.35 కోట్లు.. భార్య పేరు మీద రూ4.19 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉంది.

ఇళ్ల విషయానికి వస్తే రవిచంద్ర పేరు మీద రూ.97.34 లక్షలు.. భార్య పేరు మీద రూ.1.43 కోట్ల ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా తనకు తన భార్యకు కలిపి రూ.17.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న రవిచంద్ర తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు.

మరో టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడి ఆస్తుల విషయానికి వస్తే ఆయనకు మొత్తం రూ.5.73 కోట్లుగా పేర్కొన్నారు. బ్యాంకుల్లో రూ.12.28 లక్షలు.. ఫిక్సెడ్ డిపాజిట్లు రూ.1.20 కోట్లు.. ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.50 లక్షలు.. బాండ్లు.. షేర్లు రూ.10 లక్షలు.. ఫార్చునర్ కారు రూ.20 లక్షలతో పాటు రూ.13 లక్షలు విలువైన బంగారం.. తన భార్యవద్ద రూ.26 లక్షలు విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.

కర్నూలు జి్లా కోసిగి మండలంలో ఉన్న రూ.10 లక్షల విలువైన ఇంటితో సహా తనకు రూ.3.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మూడు బ్యాంకుల్లో ఉన్న రూ.59 లక్షల హోం లోన్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. బీటీ నాయుడికి రూ.1.17 లక్షల విలువైన ఫోన్.. భార్య పేరు మీద రూ.45 వేల విలువైన ఫోన్ ఉన్నట్లుగా తెలిపారు. తన మీద ఒక కేసు ఉన్నట్లుగా వెల్లడించారు.

మూడో అభ్యర్థి కావలి గ్రీష్మ తన ఆస్తులు రూ.3 కోట్లుగా పేరకొన్నారు. తన భర్తతో కలిసి మొత్తం రూ.3.54 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన వద్ద రూ.1.5 లక్షలు.. భర్త వద్ద రూ.3.80 లక్షల క్యాష్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆభరణాల రూపంలో రూ.13.5 లక్షలు విలువ చేసే వజ్రాలు.. రూ.35.37లక్షలు విలువ చేసే 440 గ్రాముల బంగారంతో పాటు 20 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు. తన భర్త వద్ద రూ.17.68 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. భర్త పేరు మీద వివిధ కంపెనీల్లో రూ.33.28 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాక తన పేరు మీద రూ.5 లక్షలు విలువ చేసే భూమి.. భర్త పేరు మీద హైదరాబాద్ లో రూ.40 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. భర్త పేరు మీద రూ.94.54 లక్షల అప్పులు ఉన్నట్లుగా గ్రీష్మ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన మీద ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు.

బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు రావటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. తన మొత్తం కుటుంబానికి కలిపి రూ.2.83 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందులో ఆయన పేరుతో రూ.1.62 కోట్లు.. ఆయన భార్య పేరు మీద రూ1.21 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తన భార్య వద్ద అరకేజీ బంగారం ఉందని.. రూ.57 లక్షలు విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీర్రాజు పేరు మీద రూ.1.44 కోట్ల విలువైన వ్యవసాయ.. వ్యవసాయేతర భూములు ఉన్నాయి. భార్య పేరు మీద రూ.80 లక్షల విలువైన5.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన పేరు మీద రూ.50.14లక్షల అప్పు ఉందని చెప్పిన వీర్రాజు తన పేరు మీద ఆలమూరు.. రేణిగుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించటం.. నిబంధనలకు విరుద్ధంగా గుమికూడటం.. సమావేశాలు.. ఎన్నికల సంబంధిత కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.