భూగర్భంలో అద్భుతం.. నల్లమల అడవిలో 27 కిలోమీటర్ల సొరంగం
గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులో మూడుచోట్ల నీటిని ఎత్తిపోయాలి.24 వేల క్యూసెక్కులను తరలించేందుకు 118 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ తవ్వాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 7 Jan 2025 3:19 PM GMTకొండ కింద నేలను తొలచి.. నీటిని మలిపి.. ఓ అద్భుత నిర్మాణానికి ఏపీ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టనుంది.. గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని చేపడుతోంది. కిలోమీటరు రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 27 కిలోమీటర్లు సొరంగం (టన్నెల్) తవ్వనున్నారు. ఇది పూర్తి అయితే.. బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించడం సులభం అవుతుంది. నల్లమల అడవుల మీదుగా నీటిని మళ్లించాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అటవీ అనుమతులను పరిగణనలోకి తీసుకుని భూగర్భ టన్నెల్ ప్రతిపాదిస్తున్నారు. దీంతో అటవీ, పర్యావరణ అనుమతులు సులభంగా దక్కుతాయి. పొరుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా దిగువన పోలవరం నుంచి వరద జలాలే తీసుకుంటున్నందున కేంద్ర జలసంఘం అభ్యంతరం వ్యక్తం చేయదని భావిస్తున్నారు.
గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులో మూడుచోట్ల నీటిని ఎత్తిపోయాలి.24 వేల క్యూసెక్కులను తరలించేందుకు 118 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ తవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్ నిర్మాణం కూడా అవసరం.
నల్లమల రిజర్వ్ ఫారెస్ట్. ఈ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కీలకం. అందుకనే సొరంగం తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమంటే.. సొరంగం ప్రారంభం, నీరు బయటకొచ్చే ప్రదేశాలు అటవీ ప్రాంతంలో లేకుండా చూస్తున్నారు. అంటే.. నీళ్లు ఆసాంతం అటవీ ప్రాంతంలోని నేలలోనే పారుతాయి.
ప్రతిపాదిత సొరంగం కోసం 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరం. బొల్లాపల్లి జలాశయంలోనే 15 వేల ఎకరాలు కావాలి. ఏపీలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నందున అటవీ అనుమతులు పెద్ద కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు. కాకపోతే.. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమి చూపాలి.