Begin typing your search above and press return to search.

కూటమిలో కుమ్ముకుంటున్నారుగా !

అధికారంలోకి రావడం కోసం అంతా కలసి కసిగా పనిచేశారు. వైసీపీని చూసి గట్టిగానే కాదు పట్టుదలగా చేతులు కలిపారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 3:55 AM GMT
కూటమిలో కుమ్ముకుంటున్నారుగా !
X

అధికారంలోకి రావడం కోసం అంతా కలసి కసిగా పనిచేశారు. వైసీపీని చూసి గట్టిగానే కాదు పట్టుదలగా చేతులు కలిపారు. అంతా కలసి అనుకున్నది సాధించారు అధికారం అలా వచ్చి పడింది. ఇపుడే అసలైన తేడాలు కనిపిస్తున్నాయి. పవర్ పాలిటిక్స్ లో ఎవరు ఎవరికీ కారు అని కూడా తెలిసి వస్తోంది.

ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 174 సీట్లకు గానీ 144కి పోటీ చేసింది. 31 సీట్లను త్యాగం చేసింది. ఇపుడు ఆ ముప్పయి ఒక్క సీట్లలో మెజారిటీ సీట్లలో కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయాయి. సహజంగానే గెలిచిన పార్టీ వారికి ప్రయారిటీ ఉంటుంది. కానీ తాము కూటమి ధర్మం కోసం సీట్లు త్యాగం చేశాం కాబట్టి తమకు విలువ ఇవ్వాలన్నది తమ్ముళ్ల మాటగా ఉంది.

పైగా గతంలొ వారే ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు. దాంతో బలమైన క్యాడర్ వారికి ఉంది. అంతే కాదు వారికి పలుకుబడి ఉంది. అధికారులతో పని ఎలా చేయించుకోవాలో తెలుసు. ప్రజలతో సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ప్రజా సమస్యలు కూడా బాగా తెలుసు.

ఇలా అన్ని రకాలుగా తాము సీనియర్లుగా ఉన్నామని తమకు తప్పక పెద్ద పీట వేయాల్సిందే అన్నది తమ్ముళ్ళ వాదన. కానీ ఎమ్మెల్యేగా నెగ్గిన వారికి ఒక అనుచరగణం ఉంటుంది. అధికారం చుట్టూ అంతా తిరుగుతుంది. పైగా ఒకసారి గెలిచిన వారు తాము కూడా బలపడాలని చూస్తారు. ఏదో అయిదేళ్ళకు అద్దెకి ఇచ్చినట్లుగా చూస్తే సహించలేరు అంటున్నారు

దాంతోనే అగ్గి రాజుకుంటోంది. మేమే ఎక్కువ అంటే మాదే ఆధిపత్యం అని అటు వైపు వారు అంటున్నారు. ఇలా సిగపట్లు పట్టుకుంటున్న నియోజకర్గాలు ఇపుడు అధికంగానే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమే అంటున్నారు. పిఠాపురంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకుండా పోయింది. తాజాగా అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ ఇష్యూ కూటమి అధినాయకత్వం దాకా వెళ్ళింది. దాంతో పెద్దలను పంపించి సర్దుబాటు చేయాల్సి వచ్చింది.

ఇక్కడ మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మ కూటమి గద్దెనెక్కిన తొలి నెల నుంచే అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఏ పదవీ దక్కలేదు. దాంతో ఆయన అనుచరులు కూడా మధనపడుతున్నారు. వర్మ వర్సెస్ కాకినాడ ఎంపీ అన్నట్లుగా పిఠాపురం రాజకీయం సాగుతోంది. ఈ ఆధిపత్య పోరు ఇపుడు తీవ్రంగానే ఉంది అని అంటున్నారు

అదే విధంగా చూస్తే రాయలసీమలో ఆదోని నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించారు. కూటమి ప్రభంజనంలో బీజేపీ నుంచి పార్ధసారధి గెలిచారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మీనాక్షీ నాయుడు టీడీపీ నుంచి బలంగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలగా రెండు బలమైన వర్గాలు అదోనీలో తయారయిపోయాయి. ఎవరికి వారుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో చూస్తే వైసీపీలో అయిదేళ్ళూ ఎమ్మెల్యేగా అధికారం అనుభవించి జనసేనలో చేరి తిరుపతి సీటు సాధించిన అరణి శ్రీనివాసులుకు జనసేనలోనూ నేతలతో మనసు కలవడం లేదు. ఇక టీడీపీ తమకు కంచుకోట లాంటి సీటు జనసేనకు ఇచ్చారు అని ఆది నుంచి తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవల జనసేన అధినేత పవన్ తిరుపతిలో సభ జరిపినా టీడీపీ వారు ఎవరూ కనిపించలేదు. దాని కంటే ముందు పవన్ తిరుమల కొండకు కాలినడకన వెళ్తే అక్కడా టీడీపీ నేతలు లేరని అంటున్నారు

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏకంగా మంత్రి బీజేపీకి చెందిన సీనియర్ నేత సత్యకుమార్ నే నిలువరిస్తున్నారు టీడీపీ తమ్ముళ్ళు. ఇటీవల మునిసిపల్ కమీషనర్ నియామకం విషయమ్న్లో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి రచ్చ జరిగింది.

ఇంకో వైపు చూస్తే కోస్తాలో ఉత్తరాంధ్రాలో ఇదే రకమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఒంగోలులో చూస్తే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దామచర్ల జనార్ధనరావుకు అసలు పొసగదని తెలుసు. ఈ ఇద్దరూ వేరు వేరు పార్టీలలో ఉన్నపుడు ప్రత్యర్థులుగా ఉండేవారు. ఇపుడు కూటమిలో మిత్రులుగా ఉండలేకపోతున్నారు. అలాగే తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా అనుచరులు తమ హవా కోసం చూస్తున్నారు.

ఉత్తరాంధ్రలో జనసేనకు బీజేపీకి ఇచ్చిన సీట్లలో తమ్ముళ్లు తమ పలుకుబడిని చూపిస్తున్నారు. దీంతో రెండు వర్గాలు గా మారుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలను తీసుకుంటే ఎన్నికల్లో గెలిచి నాలుగు నెలలు నిండా కాలేదు. కూటమిలో కుమ్ములాటలు మొదలైపోయాయని అంటున్నారు. వీటిని సర్దుబాటు ఎంత చేసినా వేరు వేరు పార్టీలు కాబట్టి కుదరదు అనే అంటున్నారు. మరి వీటి ప్రభావం కూటమి ప్రభుత్వం మీద ఏ మేరకు ఉంటుంది అన్నది చూడాల్సిందే.