ఏపీలో కొత్త ఎమ్మెల్సీలకు వెయిటింగ్ తప్పదు.. ఎన్నాళ్లంటే..!
ఈ నెల 21వ తేదీతో ముందస్తుగా నిర్ణయించుకున్న బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ముగియనుంది. దీంతో వారి ఎంట్రీ మరిం త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 19 March 2025 2:00 AM ISTఏపీలో కొత్తగా ఎన్నికైన(ఏకగ్రీవం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు వెయింటింగ్ తప్పదా? వారు ఎంతో ఉత్సాహంగా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సమయంలోనే మండలిలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, దానికి తగిన విధంగా వేదిక అయితే.. కనిపించడంలేదు. ఈ నెల 21వ తేదీతో ముందస్తుగా నిర్ణయించుకున్న బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ముగియనుంది. దీంతో వారి ఎంట్రీ మరిం త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తంగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఏకగ్రీవం జరిగింది. ఎమ్మెల్యే కోటాలో జనసేన తరఫున నాగబా బు, బీజేపీ తరఫున సోము వీర్రాజు, టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈపోటీకి వైసీపీ దూరంగా ఉంది. ఇక, ఇతర పార్టీల నుంచి కూడా ఎవరూ నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో ఈ ఐదుగురిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్టు సచివాలయం ప్రకటించింది.
ఆ తర్వాత.. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే వారు మండలిలో అడుగు పెడతారని అందరూ అనుకున్నారు. కానీ, ఖాళీ అయ్యే స్థానాలు ఈ నెల 29వ తేదీ వరకు ఉన్నాయి. ఆయా పదవీ కాలాల సమయాన్ని కుదించడం సరికాదు. దీంతో కొత్తగా ఏకగ్రీవం అయిన వారు.. ఈ నెల 29వ తేదీ వరకు వెయిట్ చేయకతప్పదు. ఆ తర్వాత.. అమావాస్య, ఉగాది, రంజాన్ పండుగలు వరుసనే ఉన్నాయి. దీంతో ఆయా పండుగలు అయ్యే దాకా కూడా వెయిటింగే.
ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎమ్మెల్సీలు.. వచ్చే నెల వరకు ఎదురు చూడకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుల మధ్య తాజాగా చర్చకు వచ్చింది. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిని ఇచ్చే విషయంపై ఇప్పటికే క్లారిటీ ఉన్నా.. శాఖల విషయంలో సందిగ్ధత ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏకాంతంగా జరిగిన చర్చలో నాగబాబు ఎంట్రీ పై పవన్ కల్యాణ్.. సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మొత్తంగా.. కొత్త ఎమ్మెల్సీల ఎంట్రీ, ప్రమాణ స్వీకారం వంటివి వచ్చే నెల వరకు వాయిదా పడనున్నాయని సమాచారం.