ఏపీ ప్రజలు వణికే మాట..రాష్ట్రానికి మరో తుపాను?
ఇలాంటి వేళ.. తుపాను అంటేనే ఏపీ ప్రజలు ఆందోళనకు గురయ్యే పరిస్థితి.
By: Tupaki Desk | 11 Oct 2024 4:27 AM GMTఒకటి తర్వాత ఒకటి చొప్పున విరుచుకుపడుతున్న తుపాన్లతో ఏపీ ఇబ్బందులకు గురవుతోంది. మొన్నటికి మొన్న వచ్చి పడిన తుపాను కారణంగా ఎంత నష్టం.. మరెంత కష్టమన్న విషయాన్ని ఇప్పటికి మర్చిపోలేని దుస్థితి. ఇలాంటి వేళ.. తుపాను అంటేనే ఏపీ ప్రజలు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా మరో తుపాను ముప్పు పొంచి ఉందన్న మాటను వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. అది పశ్చిమ దిశగా పయనించి.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 16 మధ్యలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య కాలంలో వాయుగుండంగా రూపాంతంర చెందుతుందని.. తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఈ నెల 17నాటికి ఏపీలోనే తీరం దాటొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలోని దక్షిణ కోస్తా.. ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15న తీరాన్ని తాకొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే వీలుంది. ఇదిలా ఉండగా.. ఏలూరు.. ప్రకాశం.. పశ్చిమగోదావరి.. పల్నాడు.. శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడ్డాయి.