రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం!
ఇప్పటికే ఈ కేసులో నవంబర్ 19న విచారణకు రావాలంటూ ఒంగోలు రూరల్ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు.
By: Tupaki Desk | 25 Nov 2024 5:56 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది!
ఇప్పటికే ఈ కేసులో నవంబర్ 19న విచారణకు రావాలంటూ ఒంగోలు రూరల్ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. దీంతో.. వర్మ హైకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలనే అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సమయంలో 19న వర్మ విచారణకు హాజరు కాలేదు.
తాను బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ లో ఉన్నానని.. తాను విచారణకు హాజరవ్వడానికి నాలుగు రోజులు సమయం కావాలని కోరారు! ఈ మేరకు ఒంగోలు సీఐకి వాట్సప్ మెసేజ్ పెట్టారు. అనంతరం తన లాయర్లను స్టేషన్ కి పంపించారు! దీంతో... నవంబర్ 25న విచారణకు రావాలని పోలీసులు మరోసారి నోటీసులు పంపించారు.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వర్మ. దీనిపై విచారణ జరుగుతుందని అంటున్నారు. దీంతో... హైకోర్టు బెయిల్ తీర్పు ఆధారంగా వర్మపై తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని చాలా మంది భావించారు. అయితే వారి అంచనాలను ఏపీ పోలీసులు పటాపంచలు చేశారు!
అవును... రెండోసారి నోటీసులు అందించినా ఈ నెల 25న విచారణకు హాజరుకాకపోవడంతో ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ మేరకు ఏపీలోని ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. నేడు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టుకు సిద్ధమయ్యారని అంటున్నారు!