సీసీ ఫుటేజ్ కోసం వైసీపీ హెడ్డాఫీసుకు మరోసారి నోటీసులు
ఐదారు రోజుల క్రితం వైసీపీ ప్రధాన కార్యాలయం కమ్ తాడేపల్లిలోని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Feb 2025 4:46 AM GMTఐదారు రోజుల క్రితం వైసీపీ ప్రధాన కార్యాలయం కమ్ తాడేపల్లిలోని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ మంటల్ని అక్కడున్న సిబ్బంది ఆర్పేయటం.. అగ్నిమాపక శాఖ వెళ్లే సరికి మంటలు ఆరిపోవటం తెలిసిందే. మంటలు ఆర్పే ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపులోనూ వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందు జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి సీసీ కెమేరాల ఫుటేజ్ ఇవ్వాలంటూ మూడు రోజుల క్రితం వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. తమ వద్ద ఎలాంటి సీసీ టీవీ ఫుటేజ్ లేదని ఆయన తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే.. ఈ సమాధానంపై పోలీసులు సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. సీసీ ఫుటేజ్ అంశంపై వ్యక్తిగతంగా హాజరై సీసీ కెమెరాల వివరాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల తీరును ఆ పార్టీ తప్పు పడుతోంది. అగ్నిప్రమావంపై కంప్లైంట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారన్న విమర్శలపై తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. ఆ విమర్శల్లో నిజం లేదన్నారు.
‘‘ఫిర్యాదు ఇచ్చిన వారిపై కేసులు పెట్టలేదు. వారికి నోటీసులు ఇవ్వలేదు. బయట సీసీ కెమెరా విజువల్స్ లో ఆధారాలు దొరకలేదు. దీంతో పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాల విజువల్స్ అడిగాం. ఆ రోజు ఎవరెవరు సమావేశానికి వచ్చారు? ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు? అనే విషయాలు పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాల సాయంతో తెలుసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే విజువల్స్ కావాలని నోటీసులు ఇచ్చాం’ అంటూ సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు పార్టీ కార్యాలయ ప్రతినిధులు బదులిచ్చారు. మాజీ సీఎం భద్రతపై పలు అనుమానాలు ఉన్నట్లుగా పేర్కొంటూ.. ‘‘జగన్ భద్రత విషయంలో ఇప్పటికే పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులకు మేమే ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం మారిన తర్వాత జగన్ నివాసం వద్ద బారికేడ్లను.. సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారు. ఇప్పుడు మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు మాకే నోటీసులు ఇచ్చారు’’ అంటూ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఇష్యూలో అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న అంశంపై పోలీసులు ఏం బదులిస్తారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.