అప్పట్లో అరెస్టులు వీకెండ్ వేళలో.. ఇప్పుడు అదేమీ లేదు
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా నోటికి పని చెప్పిన వారు ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు అవుతున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 5:06 AM GMTఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా నోటికి పని చెప్పిన వారు ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు అవుతున్నారు. అప్పట్లో అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు బాబు సైతం కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అంత దారుణమైన భాషను వాడటమే కాదు.. టీవీ చానళ్ల మైకులు తన ముందు కనిపించినంతనే.. ‘జయప్రదం’గా అంటూ సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం మొదలు రాసేందుకు సైతం ఇబ్బంది పడే అంశాల్ని నిర్మోహమాటంగా మాట్లాడేసేవారు.
ఎంతటి దరిద్రపుగొట్టు రాజకీయాలు అయినప్పటికీ తమ ప్రత్యర్థి ఇంట్లోని ఆడవాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేందుకు అస్సలు ఇష్టపడేవారు కాదు. అందుకు భిన్నంగా ఆ గీతను దాటేసిన వారిలో వల్లభనేని వంశీ.. కొడాలి నాని.. పోసాని క్రిష్ణమురళిలు ముందు వరుసలో ఉండేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంలో ఏపీలోని ప్రత్యర్థి పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు చొప్పున అరెస్టు కావటం తెలిసిందే.
ఐదేళ్ల పాలనలో ఎంతోమంది టీడీపీ నేతలు అరెస్టు అయ్యారు. ఒక దశలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం అరెస్టు అయి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నెలల తరబడి ఉండాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గత ప్రభుత్వంలో అరెస్టు అయిన వారిలో అత్యధికులు వీకెండ్ లోనే. వారాంతం వస్తుందంటే చాలు.. ఎవరో ఒకరు అరెస్టు అవుతారన్న ప్రచారం జోరుగా సాగేది. ఇందుకు తగ్గట్లే.. పేరు ప్రఖ్యాతులు ఉన్న నేతలు అరెస్టు అయ్యేవారు. ఈ సందర్భంగా అర్థరాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టుకొని మరీ వెళ్లి అరెస్టు చేసిన ఉదంతాలెన్నో.
తాజాగా జరుగుతున్న అరెస్టుల విషయానికి వస్తే.. మొన్న వల్లభనేని వంశీ కానీ.. ఇప్పుడు పోసాని క్రిష్ణమురళీ కాని అరెస్టు అయ్యింది వారం మధ్యలో కావటం గమనార్హం. వల్లభనేని వంశీ గురువారం ఉదయం వేళలో అరెస్టు అయితే.. పోసాని క్రిష్ణమురళి బుధవారం రాత్రి వేళలో అరెస్టు అయ్యారు. శివరాత్రి రోజున పోసాని అరెస్టు అయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన అరెస్టులు అన్ని ఒక ప్యాట్రన్ గా ఉండేవి. తాజాగా జరుగుతున్న అరెస్టులు మాత్రం క్లూలెస్ అన్నట్లుగా ఉండటం గమనార్హం. ఏమైనా.. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు ప్రముఖుల అరెస్టులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని మరింత హాట్ హాట్ గా మార్చేశాయని చెప్పాలి.