ఢిల్లీ రిజల్ట్ : ఏపీలో రాజకీయ పునరేకీకరణ ?
ఏపీలో వైసీపీ వెంట ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకుంటేనే అది సాధ్యపడుతుంది. ఇపుడు చూస్తే ఏపీలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా సతమతమవుతోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Feb 2025 3:30 PM GMTఏపీలో రాజకీయ మార్పులకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఢిల్లీ గెలుపు తరువాత ఆ పార్టీ భారతదేశం పొలిటికల్ మ్యాప్ లో చూసుకుంటే ఖాళీగా సౌత్ వైపే కనిపిస్తోంది. బీజేపీకి ఈ విషయంలో పట్టుదల చాలా ఎక్కువ. తమకు దక్కనిది దక్కించుకునేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేయడం ఖాయం.
కేవలం రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈ రోజున దేశంలో వరసగా మూడు సార్లు గెలిచింది అంటే దాని వెనక బీజేపీ వ్యూహాలే కారణం అని అంటారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా బీజేపీ విస్తరించాలని అనుకుంటోంది. ఈ రోజున కూటమిలో బీజేపీ ఉంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఉన్నారు. ఇది జస్ట్ ఒక ఆరంభం మాత్రమే అని అంటున్నారు.
కేంద్రంలో మోడీ ఉండగా అనేక రాష్ట్రాలు బీజేపీ ఏనాడూ అడుగుపెట్టనివి కూడా ఆ పార్టీ సొంతం అయ్యాయి. మరి ఏపీలో చూస్తే ఆ పరిస్థితి లేదు. ఎందుకు ఏపీ బీజేపీ ప్రభావానికి లోను కావడం లేదు అన్న అంతర్మధనం అయితే ఆ పార్టీలో ఉంది. ఏపీలో చూస్తే రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండే సామాజిక వర్గాల రాజ్యం కూడా సాగింది.
అయితే మూఇడవ పార్టీగా జనసేన అవతరించింది. ఆ పార్టీ వెనక కూడా మరో సామాజిక వర్గం బలంగా ఉంది. ఇక వైసీపీకి ఒక గట్టి సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది. ఈ క్రమంలో బీజేపీ ఏపీలో విస్తరించాలి అంటే వైసీపీ వెనక ఉన్న నలభై శాతం ఓట్ల వైపు చూపు సారించాల్సి ఉంటుంది.
ఏపీలో వైసీపీ వెంట ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకుంటేనే అది సాధ్యపడుతుంది. ఇపుడు చూస్తే ఏపీలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా సతమతమవుతోంది అని అంటున్నారు. ఈ సామాజిక వర్గం మెజారిటీ తొలి నుంచి కాంగ్రెస్ వెంట నడచింది. ఆ తరువాత విభజన వల్ల కాంగ్రెస్ అంతర్ధానం కావడంతో వైసీపీ వైపు మళ్ళింది. అయితే కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో పనిచేసిన వారు వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలో ఇమడలేకపోయారు అన్న చర్చ ఉంది.
దానికి తోడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి పట్ల కాస్తా ఉదాశీనతతో వ్యవహరించింది అన్న చర్చ ఉంది. యాభైకి పైగా ఎమ్మెల్యేలు అదే సామాజిక వర్గం నుంచి గెలిస్తే వారికి మంత్రివర్గంలో దక్కిన పాత్ర చాలా తక్కువ అన్న చర్చ ఉంది. అంతే కాదు వారి అసలైన రాజకీయ అధికారాలకు కోత పడింది. దాంతోనే 2024 ఎన్నికల్లో వారు వైసీపీకి దూరం అయ్యారని చెబుతారు.
అయితే మొదటి నుంచి పొలిటికల్ గా సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకునే రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్ళి అక్కడ సర్దుబాటు కాలేరు అన్నది ఉంది. దాంతో వైసీపీలోనే వారు ఉండాల్సి వస్తోంది. వైసీపీ అధినాయకత్వం తీరు మారితే వారు మళ్ళీ గేరు మారుస్తారు అన్నది కూడా ఉంది.
అయితే ప్రస్తుతం వారు ఒక ఆలోచనా దశలోనే ఉన్నారు. దాంతో ఇది బీజేపీకి పొలిటికల్ గా అడ్వాంటేజ్ అవుతుందా అన్నది చర్చగా ఉంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీని ఎంతవరకూ వారు ఇష్టపడతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. తమను ఫోర్ ఫ్రంట్ లో పెట్టి రాజకీయంగా నడిపిస్తే ఏపీలో కమల వికాసానికి వారు దారులు తెరుస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.
బీజేపీకి కావాల్సింది అంతిమంగా రాజ్యాధికారం కాబట్టి వారిని ఆ దిశగా కనుక నమ్మకం ఉంచి కదిలిస్తే తప్పకుండా వారు చేరేందుకు సిద్ధపడతారు అన్నది మరో చర్చ. అయితే కాంగ్రెస్ ఫిలాసఫీని అలావాటు పడిన వారికి బీజేపీ సైద్ధాంతిక వాదం ఎంతవరకూ నచ్చుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు కనుక జవాబు దొరికితే తొందరలోనే ఏపీలోనూ రాజకీయ పరిణామాలు మారే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.